గుంటూరు: మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను వేధించి వెంటాడిన రాష్ట్ర ప్రభుత్వం చివరికి ప్రాణాలు తీసేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.  సుధాకర్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని అచ్చెన్న ఆరోపించారు. 

''నీతి, నిజాయితీ, నిబద్దత కలిగిన ఓ వైద్యుడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన దుర్మార్గపు వైఖరే ఆయన మరణానికి కారణం. నిన్నటికి నిన్న ప్రాణం విలువ నాకు బాగా తెలుసు అన్న ముఖ్యమంత్రికి కక్షలు కార్పణ్యాలు తప్ప.. ప్రాణం విలువ తెలియదనడానికి సుధాకర్ మరణమే నిదర్శనం. నేడు డాక్టర్ సుధాకర్ ప్రాణం పోవడానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూర్ఖత్వమే కారణం'' అన్నారు అచ్చెన్న. 

read more  వైసిపి నేతల గెస్ట్ హౌస్ లో... టిడిపి నేతలపై ఎస్సై దాడి...: నెల్లూరు ఎస్పీకి సోమిరెడ్డి లేఖ

''మాస్కులు అడిగినందుకు పగబట్టి.. నడి రోడ్డుపై చిత్రహింసలు పెట్టారు. చివరికి పిచ్చోడంటూ ముద్రవేశారు. తప్పు ఒప్పుకోవాలని బెదిరించారు. వెనక్కి తగ్గకపోవడంతో.. మానసికంగా వేధించి, వేతనం కూడా చెల్లించకుండా ఆర్ధిక ఇబ్బందులకు గురిచేసి మనోవేధనతో చనిపోయేలా చేశారు'' అని మండిపడ్డారు. 

''నడిచే దైవంగా భావించే వైద్యుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం దుర్మార్గం. ప్రభుత్వ వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన సుధాకర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. కుటుంబ సభ్యులకు జగన్ రెడ్డి క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలి'' అని అచ్చెన్న డిమాండ్  చేశారు.