తిరుపతి: డాక్టర్ శిల్ప కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రొఫెసర్లకు తిరిగి పోస్టింగ్స్ ఇవ్వడంపై బాధిత కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి పోస్టింగ్స్ ఎందుకు ఇచ్చారని  వారు ప్రశ్నిస్తున్నారు. 

తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల కారణంతో డాక్టర్ శిల్ప ఆత్మహత్య చేసుకొంది. ఈ విషయమై  2018 నవంబర్ 9వ తేదీన ఏపీ సీఐడీ ప్రభుత్వానికి నివేదిక కూడ ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రోఫెసర్లను విధుల నుండి తప్పించింది.

2018 ఆగష్టు 7వ తేదీన తన ఇంట్లోనే శిల్ప ఆత్మహత్య చేసుకొంది. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో పనిచేసే ముగ్గురు ప్రొఫెసర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సీఐడీ నివేదిక ఇచ్చింది.

లైంగిక వేధింపులకు సహకరించనందుకే డాక్టర్ శిల్పను ఎండీ పరీక్షల్లో ఫెయిల్ చేశారని ఈ నివేదిక తేల్చింది. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో సీఐడీ 47 మందిని సీఐడీ విచారించినట్టుగా అప్పట్లో మీడియాకు వివరించింది.

also read:ఆ ముగ్గురి లైంగిక వేధింపులే కారణం: డాక్టర్ శిల్ప ఆత్మహత్యపై సీఐడీ

తనను ప్రొఫెసర్లు లైంగికంగా వేధిస్తున్నారని డాక్టర్  శిల్ప అప్పటి రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ కు  2018 ఏప్రిల్ 16న ఫిర్యాదు చేసింది.

డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసు అప్పట్లో సంచలనం కల్గించింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనలు జరిగాయి. దీంతో అప్పట్లో విధుల్లో ఉన్న ముగ్గురు ప్రొఫెసర్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కనీసం అరెస్ట్  కూడ చేయలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

కనీసం ఐదేళ్ల వరకు ఎలాంటి పోస్టింగ్స్ ఇవ్వనని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని బాధిత కుటుంబసభ్యులు గుర్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగి రెండేళ్లు దాటగానే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఎలా పోస్టింగ్స్ ఇస్తారని బాధిత కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.