ప్రశాంతతకు మారుపేరైన దివిసీమలో ఓ హత్య సంచలనం సృష్టించింది. అవనిగడ్డలో ప్రముఖ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన వైద్యుడు కోట శ్రీహరిరావును గుర్తు తెలియని దుండగులు ఇంటిలోనే హతమార్చారు. బెడ్రూమ్‌లో రక్తపు మడుగులో ఆయన మృతదేహం కనిపించింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి హంతకులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఇంటితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వున్న సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా దుండగులు జాగ్రత్తపడ్డట్లు తెలుస్తోంది.

కుటుంబ సభ్యులు ఊరు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీహరిరావుని దుండగులు పక్కా పథకం ప్రకారం హత్య చేసి వుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.