ఏపీ ప్రభుత్వం వేసిన సీఐడీ విచారణపై తనకు నమ్మకం లేదన్నారు డాక్టర్ అనితా రాణి. సీబీఐ ఎంక్వైరీ కోసం హైకోర్టుకైనా వెళ్తానని ఆమె స్పష్టం చేశారు. మహిళా డాక్టర్‌పై దాడి చేసిన వ్యక్తులకు డిప్యూటీ సీఎం ఎలా మద్ధతిస్తారని అనిత ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఆయనకు అర్హత లేదని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

తనను వైఎస్సార్ కాంగ్రెసు నేతలు వేధిస్తున్నారని దళిత వైద్యురాలు డాక్టర్ అనితా రాణి చేసిన ఆరోపణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. డాక్టర్ అనితా రాణి వాయిస్ రికార్డును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో పోస్టు చేయడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read:డాక్టర్ అనితారాణి వివాదం: సీఐడికి అప్పగించిన వైఎస్ జగన్

డాక్టర్ సుధాకర్ ను వేదించినట్లే తనను కూడా వేధిస్తున్నారని చిత్తూరు జిల్లా పెనమూరు ప్రభుత్వాస్పత్రి వైద్యురాలు అనితా రాణి ఆరోపించారు. తన గోడును ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితకు ఫోన్ లో వెల్లబోసుకున్నారు.

పెనుమూరు డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గం కావడంతో మరింత దుమారం చెలరేగుతోంది. తనను వైసీపీ నేతలు వేధిస్తున్నారని, తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు. బాత్రూంలో తన ఫొటోలు కూడా తీశారని ఆమె ఆరోపించారు. మార్చి 22వ తేదీన తనను వేధించారని అనితా రాణి ఫిర్యాదు చేశారు.

Also Read:ట్విస్ట్: ఆస్పత్రి నుంచి నేరుగా అజ్ఞాతంలోకి డాక్టర్ సుధాకర్

ఈ నేపథ్యంలో అనితా రాణి వ్యవహారాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ సీఐడీకి అప్పగించారు. అనితారాణి ఆరోపణలపై విచారణ జరిపి, నిజానిజాలను నిగ్గుతేల్చాలని ఆయన సూచించారు.