ఎన్నో కేసుల్లో చిక్కుముడులు విప్పి పోలీసులకు సాయం చేసిన శునకరాజం అనారోగ్యంతో మరణించడంతో విశాఖ జిల్లా పోలీసు శాఖలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఎనిమిదేళ్ల వర్ష అనే కుక్క హైదరాబాద్ మొయినాబాద్‌లోని ఇంటెలిజెన్స్ ఇంటెగ్రెటేడ్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందింది.

అనంతరం 2011లో విజయనగరం జిల్లాకు కేటాయించారు. విధి నిర్వహణలో చురుగ్గా ఉండే వర్షకు ఉన్నతాధికారులు ఎక్స్‌లెంట్ గ్రేడ్‌‌ ర్యాంక్ ఇచ్చారు. విజయనగరంలో భార్య చేతిలో హత్యకు గురైన భర్త కేసులో గట్టి సాక్ష్యాధారాలు శోధించడంలో పోలీసులకు సాయపడి.. ఆమెకు జీవితఖైదు పడటంలో కీలక పాత్ర పోషించింది.  

మరో కేసులో చీపురుపల్లిలో మేనల్లుడి చేతిలో హత్యకు గురైన వృద్ధుడి కేసులోనూ కీలక ఆధారాలు సాధించడంలో పోలీసులకు సహాయపడింది. ఇక కీలకమైన ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో ఎన్నో కూంబింగ్ ఆపరేషన్‌లలో పాల్గొని మందుపాతరలు కనిపెట్టి.. ఎంతోమంది ప్రముఖుల ప్రాణాలను కాపాడింది.

పోలీస్ శాఖలో వర్ష సేవలకు గాను స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఎన్న పతకాలను సాధించింది. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం విజయనగరం పోలీస్ గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ఆడుతుండగా తీవ్రంగా గాయపడింది.

దీంతో పోలీసులు వర్షాను విశాఖలోని ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో దానికి రక్తం ఎక్కించారు. అయితే ఎనీమియాతో బాధపడుతూ వర్ష మరణించింది. తమకు ఎన్నో కేసుల్లో సాయపడిన డాబర్ మేన్ మరణించడంతో పోలీసులు.. దాని ట్రైనర్ శ్రీనివాసరావు కన్నీటి పర్యంతమయ్యారు.