క్రికెట్ మ్యాచ్‌లో వివాదం కత్తిపోట్లకు దారి తీసింది. విశాఖ జిల్లా అనకాపల్లోని మూలపేటలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతున్న యువకుల మధ్య వివాదం చెలరేగింది.

మాట మాటా పెరగడంతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఈ వివాదంలో జోడా సాయి అనే యువకుడిపై సూర్య అనే యువకుడు కక్ష పెంచుకున్నాడు.

గ్రౌండ్‌లోకి తన వెంట తెచ్చుకున్న కత్తితో సాయిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని తోటి మిత్రులు ఆసుపత్రికి తరలించగా, సాయి అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూర్యాను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Also Read:విజయవాడ గ్యాంగ్ వార్‌లో మరో ట్విస్ట్: సందీప్‌ను పక్కా ప్లాన్‌తో హత్య చేశారన్న భార్య తేజస్విని

మరోవైపు ప్రకాశం జిల్లాలోనూ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో రెండు వర్గాలకు చెందిన ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. కొండపి మండలం నేతివారి పాలెనికి చెందిన రాజారావు, సురేంద్ర, క్రాంతి అనే ఈ ముగ్గురు యువకులు క్రికెట్ ఆడేందుకు ఊరి చివరన ఉన్న గ్రౌండ్‌కు వెళ్లారు.

అయితే అక్కడున్న మరికొంతమంది యువకులు.. ఆ మైదానంలో క్రికెట్ ఆడే విషయంలో ఘర్షణకు దిగారు. వివాదం ముదరడంతో బ్యాట్లు, వికెట్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురికి తలలు పగిలిపోయాయి. తీవ్రంగా గాయపడిని వీరిని కొండపి ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.