హైదరాబాద్: జగతి కేసు నుంచి తనను తప్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ సీబీఐ కోర్టును కోరారు. సీబీఐ తనపై ఏ విధమైన క్రిమినల్ అభియోగాలు మోపలేదని ఆయన గుర్తు చేస్తూ తనను కేసు నుంచి తప్పించాలని కోరారు. 

జగన్ అక్రమాస్తుల కేసుపై సీబీఐ కోర్టులు మంగళవారం విచారణ జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో వాదనలు జరిగాయి. సీబిఐ దాఖలు చేసిన 11, ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన 5 చార్జిషీట్లపై సీబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్ రావు విచారణ జరిపారు. 

జగతి పెట్టుబడులు, వాన్ పిక్, రాంకీ, పెన్నా సిమెంట్స్, రఘురాం సిమెంట్స్ వంటి కీలకమైన కేసులు ఇందులో ఉన్నాయి. ఈ కేసుల నుంచి మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న డిశ్చార్జీ పిటీషన్లపై సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. 

కంపెనీల చట్టాన్ని దర్యాప్తు అధికారి తప్పుగా అన్వయించారని ఆయన చెప్పారు. కంపెనీల చట్టంలోని ఏ నిబంధనను ఉల్లంఘించారనే విషయాన్ని ఎక్కడా పొందుపరచలేదని ఆయన అన్నారు. 

ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదుల విజ్ఞప్తితో విచారణను న్యాయమూర్తి నేటికి వాయిదా వేశారు. రాంకీ కేసులో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి మరో డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు.