అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పిడుగులతో  కూడిన వర్షాలు కురిసే అవకాశం వుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. కాబట్టి ప్రజలు మరీ ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు, పశువులు-గొర్రెల కాపరులు ఈ పిడుగుపాట్లకు గురవకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. 

ఏపిలోని విజయనగరం , విశాఖ , తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా వున్నట్లు తెలిపారు. ఈ జిల్లాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని విపత్తుల నిర్వహణ అధికారులు హెచ్చరించారు. వర్షాలు మొదలయ్యాయి కాబట్టి పొలాల్లో పనులు చేసుకునే వారు కొద్దిరోజులు జాగ్రత్తగా వుండాలని సూచించారు. 

విజయనగరం జిల్లాలోని పాచిపెంట, సాలూరు, కురుపాం, పార్వతీపురం, కొమరాడ, మెరకముడిదాం, దత్తిరాజేరు,రామభద్రపురం, మక్కువ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా వున్నాయని తెలిపారు. తాజాగా కురుపాం మండలం పెద్దగొత్తిలి గ్రామంలో పిడుగు పడి 10 పశువులు  మృతి చెందాయి. 

ఇక విశాఖ జిల్లాలోహుకుంపేట, అరకులోయ, అనంతగిరి, పాడేరు, మాడుగుల, చీడికాడ, రావికమతం, రోలుగుంట, చింతపల్లి, జి.మాడుగుల, గోలుగొండ, కొయ్యూరు, జీకే.వీధి, పెద్దబయలు, నాతవరం, నర్సీపట్నంలకు పిడుగుల ప్రమాదం  పొంచివుందట. 

read more  జోరు వానలో తడిసి ముద్దైన విశాఖ

అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజఓమంగి, అడ్డతీగల, మారేడుమిల్లి, వైరామవరం, కోటనండూరు, రామచంద్రాపురం, దేవిపట్నం,  గోకవరం, సీతానగరం, రంగంపేట, గండేపల్లి మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని  విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. 

పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు వర్షం పడే సమయాల్లో చెట్ల క్రింద, నీటికుంటలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు. సురక్షితమైన భవనాల్లో మాత్రమే ఆశ్రయం పొందాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ సూచించారు.