పోలవరం కాంట్రాక్టుల్లో చంద్రబాబు కు సొంత ప్రయోజనాలున్నాయంటున్న దిగ్విజయ్ సింగ్. అందుకే ’హోదా’ను గాలికొదిలేశారట.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బాగా అర్థిక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉన్నందునే ఆయన ప్రత్యేక హోదా కోసం నరేంద్రమోడీ ప్రభుత్వం మీద వత్తి డి తీసుకురాలేక, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని ఆంధ్రప్రదేశ్ ఇన్ చార్జ్ ఎఐసిసి జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ అంటున్నారు. దీనికి పోలవరం ప్రాజక్టును ఆయన ఉదాహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న దిగ్విజయ్ తిరుమల వచ్చి, శ్రీవారిని సందర్శించుకున్నారు.

పోలవరం వ్యయం అంచనాను రూ.16 వేల కోట్ల నుంచి రూ.44వేల కోట్లకు పెంచుకునే స్వేచ్ఛ ఈప్యాకేజీ వల్లే వచ్చిందని చెబుతూ ఇందులో చంద్రబాబు ఆర్థిక ప్రయోజనాలున్నాయని ఆయన ఆరోపించారు. 

ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆంధ్ర ప్రయోజనాలు తాము తప్ప మరొకరు కాపాడలేరన్నట్లు ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని డిమాండ్‌ చేసిన బిజెపి పెద్ద నాయకులు వెంకయ్యనాయుడు, అరుణ్‌ జైట్లీ అధికారంలోకి రాగానే మాట మార్చేశారని దిగ్విజయ్‌సింగ్‌ విమర్శించారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ డిమాండ్ ను వదిలేసి తనకు ప్రయోజనకరమయిన ప్యాకేజీకి ఒప్పుకున్నారని అన్నారు.

రాష్ట్ర సమస్యల మీద ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలనుకోవడాన్ని దిగ్విజయ్ స్వాగతించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన విషయం గుర్తు చేస్తూ జగన్ కూడా చంద్రబాబు అవినీతిపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.