వైజాగ్ లో ఓ రిటైర్డ్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతిలో ఏకంగా రెండున్నర కోట్లు మోసపోయాడు. ఇంతటి భారీ మోసం ఎలా జరిగిందంటే…

Digital Arrest : స్వయంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'డిజిటల్ అరెస్ట్' అనేది ప్రభుత్వ విధానమే కాదని స్పష్టంగా చెప్పినా ప్రజలకు ఇంకా అవగాహన రావడంలేదు. కొంతమంది ఇంకా ఈ డిజిటల్ అరెస్ట్ భయంతో సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఇలాంటిదే భారీ మోసం వెలుగుచూసింది... డిజిటల్ అరెస్ట్ పేరిట భయపెట్టి కోట్లు నొక్కేశారు సైబర్ కేటుగాళ్లు. విశాఖపట్నంకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి నుండి ఏకంగా రూ.2.5 కోట్లు దోచుకున్నారు.

అసలేం జరిగింది?

వైజాగ్ లో నివాసముండే ఓ రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగికి ఇటీవల పోలీస్ డిపార్ట్ మెంట్ నుండి చేస్తున్నామంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. మనీ లాండరింగ్ వ్యవహారంతో సంబంధముందని బెదిరించి సదరు ఉద్యోగిని భయపెట్టారు. మీ ఆదార్ కార్డు నంబర్ తో లింక్ అయివున్న ఫోన్ నెంబర్ ద్వారా భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని తెలిపారు. ఈ క్రమంలో కొన్ని బ్యాంక్ అకౌంట్స్ కూడా సీజ్ చేశామని... అందులో మీ అకౌంట్ కూడా ఉందంటూ రిటైర్డ్ ఉద్యోగిని మాటలతోనే భయపెట్టారు.

ఇలా సదరు రిటైర్డ్ ఉద్యోగి భయపడ్డాడని గ్రహించిన సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోయారు. అతడి ఫోన్ నెంబర్ కు ఆన్లైన్ కాల్ చేసి పోలీస్ అంటూ ఓ వ్యక్తి మాట్లాడాడు... నీతో పాటు కుటుంబసభ్యులపై కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందని... అందరికీ మూడేళ్లపాటు జైలుశిక్ష తప్పదని మరింత భయపెట్టాడు. డిజిటల్ అరెస్ట్ చేశామని... ఈ విషయం ఎక్కడా బైటపెట్టవద్దని... తాము చెప్పినట్లు చేస్తే ఈ కేసునుండి బైటపడేస్తామని సూచించారు.

సైబర్ నేరగాళ్ళు చెప్పిందంతా నమ్మిన సదరు రిటైర్డ్ ఉద్యోగి భయంతో వాళ్ళు ఎలా చెబితే అలా చేశారు. ఇలా అతడి వద్ద రూ.2.5 కోట్ల రూపాయలు లాగేశారు. అయితే తర్వాత ఇలాంటి మోసాల గురించి తెలుసుకున్న రిటైర్డ్ ఉద్యోగి తాను కూడా ఇలాగే మోసపోయానని గుర్తించాడు. అసలు పోలీసులు 'డిజిటల్ అరెస్ట్' చేయరని తెలుసుకున్న రిటైర్డ్ ఉద్యోగి తనకు జరిగిన మోసం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా బాధితుడు చాలా ఆలస్యంగా స్పందించాడు... అయితే పోలీసులు అతడినుండి ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు.

సీనియర్ సిటిజన్స్ టార్గెట్ గా రెచ్చిపోతున్న కేటుగాళ్లు...

సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ ను టార్గెట్ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. కొందరు నిజంగా పోలీసులే ఫోన్ చేశారని నమ్మి మోసపోతున్నారు... తర్వాత సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయామని తెలిసినా పరువు పోతుందని కొందరు, భయంలోనే ఉండి మరికొందరు ఈ విషయాన్ని బైటపట్టడంలేదని పోలీసులు అంటున్నారు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారని పోలీసులు అంటున్నారు.

అయితే సైబర్ నేరాల పట్ల ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వైజాగ్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ అనేదే ఉండదని... పోలీసులమని ఫోన్ చేసి బెదిరిస్తే భయపడవద్దని సూచిస్తున్నారు. నిజంగా పోలీసులే ఫోన్ చేశారని అనుమానంగా ఉంటే దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి విషయం తెలుసుకోవాలి... అంతేగాని భయపడి అకౌంట్ డిటెయిల్స్ గాని, డబ్బులు గాని ఇవ్వకూడదని పోలీసులు సూచిస్తున్నారు.