రాజమండ్రి: రాజమండ్రి తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యపోరు తారా స్థాయికి చేరింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులు, మాజీ మేయర్ పంతం రజనీశేషసాయి భర్త పంతం కొండలరావు కుటుంబాల మధ్య వర్గపోరు గడపదాటి రోడ్డుమీద పడ్డాయి. 

ఈ నేపథ్యంలో నేతలు ఒక్కొక్కరు సవాల్ ప్రతి సవాల్ తో రాజమండ్రి రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. తాజాగా టీడీపీ నేత పంతం కొండలరావు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

రాజకీయాల్లో ఒకరునొకరు కొట్టుకుందాం, తిట్టుకుందాం, అవసరమైతే తొక్కుకుందాం కానీ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం స్నేహంగా ముందుకు వెళ్దామంటూ సలహా ఇచ్చారు. రాజకీయాల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయన్నారు. 

ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని సొంతంగా పనిచేసుకోనివ్వాలని హితవు పలికారు. ఎమ్మెల్యే అంటే ముగ్గురు వెళ్తున్నారని రాజమండ్రికి ఒకరా లేక ముగ్గురు ఎమ్మెల్యేలా అంటూ సెటైర్లు వేశారు. ఆదిరెడ్డి భవానీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చారని, విద్యావేత్త అని ఆమెకు అన్ని విషయాలపై అవగాహన ఉందన్నారు. 

తన భార్య పంతం రజనీ శేష సాయి రాజమండ్రి మేయర్ గా అవినీతి రహిత పాలన అందించిందని చెప్పుకొచ్చారు. ఆమె మేయర్ గా కొనసాగుతున్నప్పుడు తాను గానీ తన కుటుంబ సభ్యులు గానీ జోక్యం చేసుకోలేదన్నారు. 

గోడలు దూకే వ్యక్తులు తనను విమర్శించడం చూస్తుంటే నవ్వొస్తుందన్నారు. ఒక పార్టీలో కొన్నాళ్లు ఉండటం మరో పార్టీని తిట్టడం, అక్కడ పదవి పొంది తిట్టిన వారి పంచన చేరడం వంటి పనులు తాను చేయలేదంటూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై విరుచుకుపడ్డారు పంతం కొండలరావు. 

తాను ఐదేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తటస్థంగానే ఉన్నానని ఎవరికీ మద్దతు పలకలేదన్నారు. అంతేకానీ మీలా పార్టీలు మారి రాజకీయాలు చేయడం లేదని పంతం కొండలరావు హెచ్చరించారు.