విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండమెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా ఉంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ సైతం ప్రజాతీర్పుపై సంబరపడిపోతున్నారు. 

ప్రజల తీర్పును గౌరవిస్తూ వారికి మంచి పాలన అందించాలనే తపనతో వరుస సమీక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాలనపై పట్టుసాధించేందుకు సీఎం జగన్ నానా పాట్లు పడుతుంటే విశాఖపట్నం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం వర్గపోరు మెుదలైంది. 

అధికారంలోకి వచ్చి ఇంకా నెలరోజులు కూడా కాకముందే నేతలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతూ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇదంతా మంత్రి సన్మాన సభలో జరగడం విశేషం. రాష్ట్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా విశాఖపట్నం చేరుకున్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. 

తొలిసారిగా నగరానికి వచ్చిన పర్యాటక శాఖమంత్రి అవంతి శ్రీనివాస్ కు నగర పార్టీ అధ్యక్షడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సన్మానసభ ఏర్పాటు చేశారు. సన్మాన సభలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. 

సన్మాన సభలో ప్రసంగిస్తూ విశాఖపట్నం రూరల్, ఏజెన్సీ పరిధిలో అన్ని సీట్లు గెలుచుకున్నామని అయితే నగర పరిధిలో మాత్రం నాలుగు సీట్లు కోల్పోయామని ఆ లోటు తీర్చేందుకు మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తించాలని కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 

జీవీఎంసీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. జీవీఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుకు నడిపేలా అవంతి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. తాము అంతా అందుబాటులో ఉండి జీవీఎంసీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. 

కరణం ధర్మశ్రీ వ్యాఖ్యలపై చిర్రెత్తుకొచ్చిన మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు  చేశారు. కొంతమంది నేతలు ఇక్కడ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దాని వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని స్పష్టం చేశారు. 

అవంతి శ్రీనివాస్ ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకు మాత్రమే మంత్రి కాదని రాష్ట్రానికి మంత్రి అనే విషయాన్ని గుర్తించాలన్నారు. అవంతి శ్రీనివాస్ నాయకత్వంలో జీవీఎంసీ ఎన్నికల్లో ముందుకు వెళ్దామన్నారు. ఈ సందర్భంగా తప్పుడు మాటలు చెప్పొద్దంటూ మెుదటిసారిగా హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.

 ద్రోణంరాజు శ్రీనివాస్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు ధర్మశ్రీ. తాను తప్పుడు సంకేతాలిచ్చానని కొంతమంది చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపుని దృష్టిలో పెట్టుకుని కూడా అవంతికి మంత్రి పదవి ఇచ్చారని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే ధర్మశ్రీ. మంత్రి అవంతి శ్రీనివాస్ సాక్షిగా ఎమ్మెల్యేలు ఇద్దరూ వార్నింగ్ లు ఇచ్చుకోవడంపై అంతా నిర్ఘాంతపోయారు.