అనంతపురం జిల్లాల్లోని వజ్రకరూర్ మండలంలో వజ్రాల వేట మొదలైంది. ఈ వజ్రాల కోసం వివిధ ప్రాంతాల నుంచి గ్రామస్థులు భారీగా తరలివస్తున్నారు. కనిపించిన ప్రతి పొలంలో అనువణువు గాలిస్తున్నారు. ఇంతకీ ఏంటిదంతా అనుకుంటున్నారా..?

జూన్‌లో వర్షాలు పడిన వెంటనే ఇక్కడి పొలాల్లో వజ్రాలు దొరుకుతాయనే ప్రచారమే దీనికి కారణం. ఈ ప్రచారం మిగిలిన జిల్లాలకు వ్యాపించింది. ఎప్పటిలాగానే ఈ సారి కూడా ప్రజలు వజ్రకరూర్‌కు తరలివస్తున్నారు. ఒక్క చిన్న వజ్రమైనా దొరకకపోతుందా అని ఎదురుచూస్తున్నారు.

ఒక్క వజ్రం దొరికినా జీవితం సెటిల్ అయిపోతుందని వారి ఆశ. అయితే... ఇప్పటి వరకు ఎవరికైనా నిజంగా వజ్రాలు దొరికాయోలేదో మాత్రం తెలియదు. కానీ ప్రతి సంవత్సరం వర్షం పడగానే వాటి కోసం వెతకడం మాత్రం ప్రజలు మానడం లేదు. సమయం ఎందుకు వృథా చేయడమని భోజనాలు కూడా అక్కడే చేస్తుండటం గమనార్హం.