గుంటూరు: సంగం డెయిరీలో అవినీతికి పాల్పడ్డాడంటూ టిడిపి మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రను ఏసిబి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా తనపై పెట్టిన కేసులు, అరెస్ట్ పై ధూళిపాళ్ల ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇలా ధూళిపాళ్ళ దాఖలుచేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు అనుమతించింది. ఈ పిటిషన్‌ పు మధ్యాహ్నం 2.15కి విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు. 

అవినీతి ఆరోపణల నేపథ్యంలో ధూళిపాళ్ల నరేంద్రను శుక్రవారం ఉదయం ఏసిబి అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు విజయవాడ ఈఎస్ఐ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఏసిబి న్యాయస్థానం ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ధూళిపాళ్ళను విజయవాడ జిల్లా జైలుకు  తరలించారు.

ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. ఈ డెయిరీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ ఛైర్మన్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. నరేంద్రపై 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఆర్పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. నరేంద్రపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తన నోటీసులో చెప్పింది. 

read more   అమూల్ కు కట్టబెట్టే కుట్ర, జగన్ రెడ్డి గుర్తించాలి: ధూళిపాళ్ల అరెస్టుపై చంద్రబాబు

నరేంద్రను అరెస్టు చేయడం దుర్మార్గమైన విషయమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చట్టం తన పని తాను చేస్తుందని ఆయన అన్నారు. కేసు ఏమిటో తెలియదని, విషయం చెప్పకుండా అరెస్టు చేశారని, ఇది దారుణమని ఆయన అన్నారు. తప్పు చేస్తే నోటీసు ఇవ్వాలని ఆయన అన్నారు. నేరం ఏమిటో తెలియదని ఆయన అన్నారు. కోర్టులో ఉన్న విషయం మీద ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. అరెస్టు చేయకపోతే ప్రపంచం బద్దలైపోతుందా అని ఆడిగారు. కరోనా విలయతాండవం చేస్తుంటే, వందల మంది పోలీసులు ఇంట్లోకి వెళ్లి అరెస్టు చేయడం ఈ సమయంలో అవసరమా అని అడిగారు. 

కక్ష సాధింపు చర్యలో భాగంగానే అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద విమర్శలు చేస్తున్నందు వల్లనే అరెస్టు చేశారని ఆయన అన్నారు. వైఎస్ జగన్ మీద ఎవరు విమర్శలు చేస్తే వారిని అరెస్టు చేస్తున్నారని ఆయన అన్నారు. దొంగలం, బందిపోట్లం కాదని, నోటీసులు ఇస్తే సమాధానం చెప్తామని ఆయన అన్నారు. ఈ సంఘటనపై ఏం చేయాలనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు చెప్పారు.