తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. నిత్యం ప్రజల్లో ఉంటున్న ప్రజా ప్రతినిధులకు వారి సిబ్బందికి సైతం వైరస్ సోకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్‌కి కరోనా సోకింది.

అలాగే తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు పీఏకు పాజిటివ్‌గా తేలడంతో మంత్రి కుటుంబం హోం క్వారంటైన్‌లో ఉంటోంది. మరోవైపు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆయన భార్య, డ్రైవర్, గన్‌మెన్, వంట మనిషికి సైతం కరోనా సోకడంతో అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి.

Also Read:ఏపీలో ఆరు వేలు దాటిన కరోనా కేసులు: ఒక్క రోజులో 294 మందికి పాజిటివ్, ఇద్దరి మృతి

తాజాగా ఏపీలోనూ ఇదే రకమైన వాతావరణం కనిపిస్తోంది. అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గన్‌మెన్ సురేశ్ కరోనాతో మరణించాడు. కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే తోటివారు చులకనగా చూస్తారనే మొహమాటంతో తన గన్‌మెన్ వైరస్‌తో మరణించాడని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా రోగిని రోగిగా చూడకండి.. అనుమానం వస్తే వెంటనే  పరీక్షలు చేయించుకోవాలని కేతిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అసలు మొహమాటపడొద్దని ఆయన పేర్కొన్నారు. తనకు చేసిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని కేతిరెడ్డి తెలిపారు. మరోవైపు ధర్మవరం ఎమ్మెల్యే కార్యాలయంలో మొత్తం 8 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. 

Aslo Read:చంద్రబాబు ఇంటి వద్ద విధులు నిర్వహించిన కానిస్టేబుల్ కు కరోనా

ఆంధ్రప్రదేశ్ కరోనా ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. ఆదివారం రికార్డు  స్థాయిలో 294 మందికి పాజిటివ్‌గా తేలడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,152కి చేరింది. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో ఇద్దరు మరణించంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 84కి చేరింది.