ఉప ఎన్నికల్లో గెలుస్తామన్న ధైర్యం లేక ఫిరాయింపు ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించటం లేదని ఎద్దేవా చేసారు.
ఉపఎన్నికలకు వెళ్ళే దమ్ము టిడిపి లేదని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు తేల్చేసారు. ఉత్తరాంధ్రలోని సీనియర్ నేతల్లో ఒకరైన ధర్మాన మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ సమవేశాలను ప్రభుత్వం తూతూ మంత్రంగా నడుపుతోందని విమర్శించారు. ప్రజల సమస్యలు, ఆవేదనను పంచుకునేందుకు సరైన వేదికగా ధర్మాన అసెంబ్లీని అభివర్ణించారు. ఒడిస్సాలో 85 రోజులు, తెలంగాణాలో 75 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుంటే ఏపిలో మాత్రం ఎందుకు అన్ని రోజులు నడపలేకపోతున్నారంటూ ధ్వజమెత్తారు.
ఎంఎల్సీ ఎన్నికలు స్వేచ్చగా జరిగితే టిడిపి గెలుస్తుందన్న నమ్మకం లేకే నామినేషన్లు వేసిన వారిని బెదిరించి మరీ వారి నామినేషన్లను ఉపసంహరింప చేయిస్తున్నట్లు ఆరోపించారు. మంత్రిపదవులు, కాంట్రాక్టులతో పాటు ఇతర ప్రలోభాలకు గురిచేసి వైసీపీ ఎంఎల్ఏలను ఫిరాయింపులకు ప్రోత్సహించం అధికార పార్టీకే అవమానమని మండిపడ్డారు. గడచిన రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో ఒక్క ఎన్నిక కూడా నిర్వహించే దమ్ము టిడిపికి లేకపోయిందన్నారు. ఉప ఎన్నికల్లో గెలుస్తామన్న ధైర్యం లేక ఫిరాయింపు ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించటం లేదని ఎద్దేవా చేసారు.
