విశాఖపట్నం: మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే  విశాఖపై పోలీస్ శాఖ ఫోకస్ పెట్టింది. 

పాలనా రాజధాని విశాఖలో తీర్చాల్సిన అవసరాలపై పోలీసు శాఖ దృష్టి పెట్టింది. భద్రత, మౌలిక సదుపాయాలపై కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఛైర్మనుగా విశాఖ సీపీ ఉంటారు. చైర్మన్ తో పాటు ఎమిమిది సభ్యులతో డీజీపీ గౌతమ్ సవాంగ్ కమిటీని ఏర్పాటు చేశారు. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని డీజీపి ఆదేశాలు జారీ చేశారు.

సీఆర్‌డీఏ, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం నాడు  ఆమోదం తెలిపారు. దీంతో శాసనససభ రాజధానిగా అమరావతి, జ్యూడిషీయల్ కేపిటల్ గా కర్నూల్, ఎగ్జిక్యూటివ్ గా విశాఖపట్టణం ఏర్పాటుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది. ఇలా గవర్నర్ ఆమోదం లభించిన  పాలనా యంత్రాగాన్ని అమరావతి నుండి విశాఖకు తరలించే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మరో 14రోజుల్లో సీఎం కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 15వ తేదీలోపు విశాఖకు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని తరలించి... 15వ తేదీన పూజ నిర్వహించాలని భావిస్తున్నారట. ఆ మేరకు తరలింపుకు సబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ప్రభుత్వం నుండి ఆదేశాలు కూడా అందినట్లు సమాచారం. ముందుగా ముఖ్యమంత్రి కార్యాలయం తరలింపుతోనే పరిపాలనా రాజధాని తరలింపు ప్రారంభమవ్వాలని వైసిపి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 తర్వాత ముఖ్యమంత్రి విశాఖ నుంచే పాలనా వ్యవహారాలు చూసుకోన్నారట

అలాగే అమరావతిలోని మిగతా ప్రధాన కార్యాలయాల తరలింపుపై హెచ్.ఓ.డి.లకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు సమాచారం. విశాఖకు తరలివెళ్లేందుకు సిద్దం అవ్వాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఇప్పటికే మానసికంగా సిద్దం అయిన ప్రధాన కార్యాలయాలాల ఉద్యోగులు సైతం విశాఖకు తరలేందుకు సంసిద్దంగా వున్నారు. సెప్టెంబరు నాటికి పూర్తిస్థాయిలో విశాఖ నుంచే పరిపాలన సాగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశలవారీగా ప్రధాన కార్యాలయాల తరలించనున్నట్లు తెలుస్తోంది.