విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టును చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. 

పోలవరం పూర్తైతే జగన్ కు రాజకీయ మనుగడ ఉండదనే భయం పట్టుకుందన్నారు. జగన్  తన స్వార్థం కోసం రైతులకు, ప్రజలకు ద్రోహం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని దేవినేని స్పష్టం చేశారు. 

కేంద్రం నుంచి ప్రాజెక్టుకు రూ.3342 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు పనులు 62.61 శాతం పూర్తి అయినట్లు మంత్రి తెలిపారు. మరోవైపు ప్రాజెక్టును అడ్డుకోవడానికి పక్కరాష్ట్రాలతో చేతులు కలిపి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

పోలవరం చెల్లింపుల్లో అక్రమాలు నిజమేనని కేంద్ర మంత్రి చెప్పిందన్నది అవాస్తవమన్నారు. అత్యున్నత ప్రమాణాలతో నిర్మితమవుతున్న ప్రాజెక్టుగా పోలవరాన్ని గుర్తించి కేంద్రం అవార్డు ఇచ్చిందని దేవినేని గుర్తుచేశారు.