గుంటూరు: ప్రపంచం మొత్తం కరోనాపై యుద్ధం చేస్తుంటే రాష్ట్రంలో జగన్ మాత్రం కరోనాతో సహజీవనం చేయాలని చెబుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఈ మేరకు ఇవాళ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్వారంటైన్ సెంటర్లలో ఎక్కడ ఎంతమంది ఉన్నారో బులిటెన్లలో ఎందుకు ఇవ్వడం లేదు? ట్రూనాట్ టెస్ట్ లు కానీ, ఆర్టీపీసీఆర్ టెస్ట్ లు జరుగుతున్నాయా లేదా...? అని ప్రశ్నించారు.  ఎన్ని జరిగాయో చెప్పాలని... వారం రోజులుగా ఎన్ని టెస్ట్ లు చేశారని అడిగారు. 

''37 రోజుల్లో 13 జిల్లాల్లో క్వారంటైన్ సెంటర్లలో ఎంతమంది ఉన్నారు. ఏ సెంటర్ కు, ఏయే జిల్లాకు ఎంత  ఖర్చుపెట్టారో చెప్పాలి. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు పీపీఈ కిట్లు, మాస్క్ లు, గ్లౌజులు ఎవరెవరికి ఎన్ని ఇచ్చారు? జిల్లాకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పే ధైర్యం ఉందా?'' అని అన్నారు. 

''క్వారంటైన్ సెంటర్లలో ఉండే వారికి ఏయే సౌకర్యాలు కల్పించారో చెప్పాలి. అక్కడ సరిగా సౌకర్యాలు లేవు. వాస్తవాలను జగన్ ఎందుకు జీర్ణించుకోలేక పోతున్నారు. టీవీ 5 మూర్తి గారిని అరెస్ట్ చేయడానికి ఇక్కడి నుంచి టీంలు ఎందుకు వెళ్లాయో సమాధానం చెప్పాలి. అమరావతి, కరోనాలో ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన వారిని జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి తట్టుకోలేకపోతున్నారు. కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు'' అని ఆరోపించారు. 

''డాక్టర్ సుధాకర్ ను సస్పెండ్ చేశారు. నగరి మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేశారు. ఒంగోలులో లేడీ డాక్టర్ ను బెదిరించారు. టీవీ 5 మూర్తి నిర్భందించి ప్రశ్నించారు. ఏబీఎన్ రామారావు, ఈటీవీ ద్వారా ప్రశ్నించే వారిని కూడా బెదిరిస్తున్నారు. మీకు అందరూ భజన చేయాలా. వాస్తవాలు చెబితే ఎందుకు కక్ష సాధిస్తున్నారు. చంద్రబాబుగారిని తిట్టిస్తున్నారు. హెరిటేజ్ పై దాడి చేస్తున్నారు. ఇందుకేనా బూతుల మంత్రులను పెట్టుకున్నారు'' అని మండిపడ్డారు. 

''పేద కుటుంబాలకు 5వేలు ఇవ్వాలని, పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నేతలు నిరాహార దీక్షలు చేస్తుంటే పరిహాసం చేస్తున్నారు. కర్నూలు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్లడం లేదు. కరోనా సామాజిక వ్యాప్తి జరుగుతోందని చెబితే కోపం వస్తోంది. హెల్త్ మినిస్టర్ అటెండర్ కు, రాజ్ భవన్ లో నలుగురికి కరోనా వచ్చింది. తాడేపల్లిలో సీఎం రాజప్రాసాదంకు సాయం పేరుతో అనేక మంది వస్తున్నారు. ఏం జాగ్రత్తలు తీసుకున్నారు. రికార్డెడ్ ప్రెస్ మీట్ లో అయినా జగన్ నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి'' అని డిమాండ్ చేశారు. 

''రేషన్ కు వేలిముద్రలు వేయాలా? రెండు సార్లు వేలిముద్రలు వేయలేదు. వీఆర్వోలు ఏం చేస్తున్నారు. రేషన్ షాపుల వద్ద వందలమంది గుమికూడుతున్నారు.  వైసీపీ ఎంపీ వద్ద బియ్యం పట్టుబడితే జగన్ ఎందుకు నోరుతెరవడం లేదు. 13 జిల్లాల్లో దోపిడీ జరుగుతోంది'' అని ఆరోపించారు.