అధికారం చేతిలోకి వచ్చింది కదా అని హద్దు మీరొద్దని వైసీపీ నేతలకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ వార్నింగ్ ఇచ్చారు. సత్యనారాయణపురంలోని పంతులుగారి షెడ్ రోడ్డులో టీడీపీ నియోజకవర్గ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో కలిసి అవినాష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజా నిర్ణయాన్ని తాము శిరసావహిస్తామన్నారు. అధికారం వచ్చింది కదా అని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని చెప్పారు. హద్దు మీరితే మాత్రం తాము ఊరుకోమని హెచ్చరించారు. వైసీపీకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

టీడీపీ కార్యాలయాన్ని సత్యనారాయణ పురంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశామని కొన్ని రోజుల్లో ఏలూరురోడ్‌లో కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో జరుగనున్న పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్‌ ఎన్నికల్లో టీడీపీ తన సత్తా చూపుతుందని దేవినేని అవినాష్‌ పేర్కొన్నారు.