ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఉన్న నమ్మకంతోనే తాను ఆ పార్టీలో చేరినట్లు దేవనేని అవినాష్ తెలిపారు. ఆయన ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలుతనను ఆకర్షించాయని ఆయన చెప్పారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలపునకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలను కలుపుకుని ముందుకు వెళ్తానన్నారు. పార్టీలో చేరడానికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

AlsoRead టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరం, కారణం ఆ ఇద్దరే: టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు...

కాగా... చాలాకాలం తర్వాత దేవినేని కుటుంబానికి విజయవాడ తూర్పు నియోజకవర్గం దక్కింది. దేవినేని అవినాష్ కి తాజాగా జగన్  విజయవాడ తూర్పు పగ్గాలు అప్పగించారు. గత ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీచేసిన బొప్పన భవకుమార్‌కి నగర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది.
 
బెజవాడ రాజకీయాల్లో సుమారు నాలుగు దశాబ్దాలుగా తమదైన ముద్రచాటుతున్న ఘనత దేవినేని కుటుంబానిది. విజయవాడ తూర్పు నియోజకవర్గంతో ఈ కుటుంబానిది విడదీయరాని బంధం. దేవినేని నెహ్రూ టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా ఆయన పనిచేశారు. కంకిపాడు నియోజకవర్గం నుంచే ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కంకిపాడు దేవినేని కుటుంబానికి పెట్టని కోటగా ఉండేది.

AlsoRead డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి షాక్... హైకోర్టు నోటీసులు...
 
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కంకిపాడు నియోజకవర్గంలో అధికశాతం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కలిసింది. దీంతో తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నెహ్రూ వారసుడు దేవినేని అవినాశ్‌ ఆకాంక్షించేవారు. నెహ్రూ అనుచరగణం ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నది కూడా ఈ నియోజకవర్గంలోనే. దీంతో తూర్పు కేంద్రంగా రాజకీయంగా ఎదగాలని అవినాశ్‌ కోరుకునేవారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు అవినాశ్‌ గుడివాడ నుంచి బరిలోకి దిగారు.

అయితే.. అవినాష్ ఓటమి పాలయ్యారు. తనకు తూర్పు బాధ్యతలు ఇవ్వాలని అవినాష్ చాలా సార్లు చంద్రబాబుని కోరారు. అయితే.. చంద్రబాబు సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో చాలా కాలం నుంచి అసంతృప్తిలో ఉన్న అవినాష్.. తాజాగా వైసీపీలో చేరగా.. తనకు పట్టున్న ప్రాంతం మళ్లీ చేతికి చిక్కింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేవినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.