వదిన ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ కాదని రూ.10 పెన్నుతో పవన్ తొలి సంతకం... అభిమానుల్ని గుండెల్లో పెట్టుకోవడమంటే ఇదే
పవన్ కల్యాణ్ అంటే కుర్రకారులో ఎంతో క్రేజ్ ఉంది. ప్రత్యేకించి ఆయన ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. పవన్ కల్యాణ్ కోసం అభిమానులు ఎక్కడిదాకా అయినా వెళతారు. అలాగే, అభిమానులంటే పవన్ కల్యాణ్ కు కూడా అమితమైన అభిమానం, అనురాగం చూపిస్తారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్... ఈ పేరు వింటే యువత ఉర్రూతలూగుతుంది. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. పక్కా మాస్ ఫాలోయింగ్‌తో సింపుల్, క్లాస్ ఫాలోవర్లు కూడా లక్షలాది మంది పవన్ కల్యాణ్ వెంట ఉన్నారు. 2014లో పార్టీ స్థాపించిన నాటి నుంచి 2024 ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించే వరకు అభిమానులే ఆయన వెన్నంటి ఉన్నారు. జనసేనను నాయకులు వీడినా.. అభిమానులు మాత్రం వదులుకోలేదు.
పవన్ కల్యాణ్ సభలు పెడితే చూసేందుకు వచ్చేవాళ్లంతా ఓటేయరనే నానుడి ఉంది. అయితే, ఈసారి పవన్ కల్యాణ్ గ్రాండ్ విక్టరీ సాధించారు. వంద శాతం స్ట్రైక్ రేటుతో జనసేన అభ్యర్థులు పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందారు. జనసేన సాధించిన ఈ ఘన విజయంలో కార్యకర్తలతో పాటు పవన్ కల్యాణ్ అభిమానుల పాత్ర ఎంతో ఉంది.
పదేపదే తనను విమర్శించే వారికి చెంపపెట్టులాంటి విజయం సాధించిన పవన్ కల్యాణ్... ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన పదవిని ఆయన అధిరోహించారు. డిప్యూటీ సీఎంతో పాటు ఐదు కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వదిన సురేఖ ఎంతో ప్రేమతో ఇచ్చిన రూ.3.50 లక్షల విలువైన మాంట్ బ్లాంక్ వాల్ట్ డిస్నీ పెన్‌ను పక్కనపెట్టి... ఓ సాధారణ పెన్నుతో సంతకం చేశారు.
విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కల్యాణ్.. తొలిసారి కొన్ని ముఖ్యమైన దస్త్రాలపై సంతకాలు చేశారు. అయితే, ఆ సమయంలో పవన్ కల్యాణ్ సంతకం చేసిన పెన్ను గురించి అనేక విధాలుగా చర్చ జరిగింది. వదిన ఇచ్చిన ఖరీదైన పెన్నుతో పవన్ కల్యాణ్ తొలిసంతకం చేశారని అంతా అనుకున్నారు. అయితే, పవన్ మాత్రం.. ఓ సాధారణ అభిమాని బహూకరించిన పెన్నుతో డిప్యూటీ సీఎంగా తొలి సంతకం చేశారు.
పవన్ ఎందుకలా చేశారో తెలుసా..?
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే ముందు రోజు మంగళగిరి నుంచి అమరావతికి ర్యాలీగా చేరుకున్నారు. ఈ క్రమంలో అమరావతి రైతులు ఆయనకు అడుగడుగునా సాదర స్వాగతం పలికారు. రోడ్డంతా పూలు పరిచి తమ అభిమానం చాటుకున్నారు. ఆ సమయంలో జనంలో నుంచి ఓ అభిమాని పవన్ కల్యాణ్‌కు పెన్ను అందించాడు. ఆ పెన్నును జాగ్రత్తగా తీసుకొని... జేబులో పెట్టుకున్నారు పవన్. ఆ పెన్ను విలువ పది రూపాయలే అయినా... పవన్ కల్యాణ్ మాత్రం ఎంతో విలువ ఇచ్చారు. వదిన ఇచ్చిన రూ.3.50 లక్షల విలువైన స్పెషల్ ఎడిషన్ పెన్నును కాదని అభిమాని ఇచ్చిన సాధారణ రూ.10 పెన్నుతో తొలి సంతకం చేయడం అభిమానుల మనసు చూరగొంది. ఇది అభిమానులకు పవన్ కల్యాణ్ ఇచ్చే విలువ అంటూ ఆయన ఫ్యాన్స్ తెగ మురిసిపోయిన ఘట్టం.
సింప్లిసిటీయే ఆయన ప్రత్యేకం....
పవన్ కల్యాణ్ మొదటి నుంచి చాలా సింపుల్‌గా ఉంటారు. ఆడంబరాలు ఆయన నచ్చవు. ప్రెస్‌మీట్లు పెట్టినప్పుడు అయితే, సాధారణ వైట్ అండ్ వైట్‌లో కనిపిస్తారు. అందుకే పవన్ తన అభిమాని ఇచ్చిన రూ.10 పెన్నుతోనే తొలి సంతకం చేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక... గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో మాత్రం వదిన సురేఖ ఇచ్చిన ఖరీదైన పెన్నుతోనే సంతకం చేశారు. అయితే, వదిన ఇచ్చిన ఖరీదైన పెన్నుతో పాటు అభిమాని ఇచ్చిన మామూలు పెన్నును కూడా పవన్ కల్యాణ్ భద్రంగా జేబులో పెట్టుకున్నారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజు కూడా పవన్ కల్యాణ్ అభిమాని ఇచ్చిన పెన్నుతో కనిపించారు. అసెంబ్లీలో అదే పెన్నుతో సంతకం చేశారు.
ఓ అభిమాని ఇచ్చిన మామూలు పెన్నును పక్కనపెట్టకుండా పవన్ కల్యాణ్ ఇలా భద్రంగా దాచుకోవడం, అవసరమై ప్రతి సందర్భంలో అదే పెన్నుతో సంతకం చేయడం మామూలు విషయం కాదు. ఈ ఒక్క సంఘటన చాలు.. అభిమానులంటే పవన్ కు ఎంత అభిమానమో చెప్పడానికి...