ఏపీలో అధికార వైసీపీలో ఉన్న కాపు నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులు వైసీపీతోనే ఉన్నారని అన్నారు.
ఏపీలో అధికార వైసీపీలో ఉన్న కాపు నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులు వైసీపీతోనే ఉన్నారని అన్నారు. పవన్ కల్యాణ్‌ది కమర్షియల్ ఆలోచన అని మండిపడ్డారు. కాపు నేతలను తిట్టడం సరైనది కాదని అన్నారు. పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారని.. ఆ రెండు చోట్ల కాపు సామాజికవర్గం అధికంగా ఉన్నారని.. అలాంటప్పుడు ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. తాము ప్రజలతో ఉన్నవాళ్లమని చెప్పారు. పవన్ కల్యాణ్‌కు ఆ యోగ్యత లేదని అన్నారు.
కాపుల్లో సినిమా వ్యామోహంతో తిరిగే కుర్రాళ్లను పవన్ కల్యాణ్ రెచ్చగొడుతున్నారని కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. టీడీపీని బతికించేందుకు పవన్ కల్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నారని ఆరోపించారు. పవన్ చర్యలతో కాపు సామాజికవర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.
ఇదిలా ఉంటే.. వైసీపీలోని కాపు ప్రజాప్రతినిధులు అక్టోబర్ 31న రాజమండ్రిలో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి వైసీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. వైసీపీలోని కాపుల నాయకులపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వైసీపీ అధిష్టానం సూచనలతోనే ఈ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా సమాచారం.
