వైసిపి నేతలను ఢిల్లీ పొలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేకహోదా డిమాండ్ తో ఢిల్లీలోని సంసద్ మార్గ్ లో ధర్నా చేస్తున్న ఎంపిలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను పోలీసులు అరెస్టు చేశారు. అనుమతి లేనిచోట ధర్నా చేస్తున్నారంటూ పోలీసులు వైసిపి నేతలను అడ్డుకోవటం గమనార్హం. ఉదయం నుండే పార్టీ ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో మార్గ్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. శ్రేణులను ఉద్దేశించి పలువరు మాట్లాడారు కూడా.

ధర్నా కార్యక్రమం ముగించుకునని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా బయలుదేరిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుండి బలవంతంగా అరెస్టు చేసి తరలించారు. ఈ సందర్భంగా నేతలను తరలిస్తున్న పోలీసులను అడ్డుకునేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నించడంతో కొంతసేపు సంసద్‌మార్గ్‌లో ఉద్రిక్తత నెలకొంది.

వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వరప్రసాద్‌, వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులను అరెస్టు చేసి వాహనంలో పోలీసు స్టేషన్‌కు తరలించారు.