వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కొనసాగుతుందని ఢిల్లీ హై కోర్టు  స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఈ మేరకు తీర్పునిచ్చింది. కాగా వైఎస్సార్ అన్న పదం తమకే చెందుతుందని ‘అన్న వైఎస్సార్’ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సీపీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 

ఈ క్రమంలో శుక్రవారం ఈ పిటిషన్ మీద కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తప్పుడు ఉద్దేశాలతో కేసు వేశారని పేర్కొంటూ వైఎస్సార్ పిటిషన్ ను కొట్టివేసింది. అన్నవైఎస్సార్ పిటిషన్ కు ఎలాంటి మెరిట్ లేదన్న న్యాయస్థానం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కొనసాగుతుందని స్పష్టం చేసింది. 

ఇదిలా ఉండగా, వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో పాడి రైతులకు ఇచ్చిన హామీ మేరకు అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకొన్నామని చెప్పారు. అమూల్ సంస్థ  ఏపీ రాష్ట్రంలోని మరో జిల్లాలో పాల సేకరణను ఇవాళ్టి నుండి ప్రారంభించనుంది.ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. 

రాష్ట్రంలో ఇప్పటికే చిత్తూరు, కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అమూల్ సంస్థ పాలను సేకరిస్తోంది. ఇవాళ్టి నుండి పశ్చిమగోదావరి  జిల్లాలోని 142 గ్రామాల్లో అమూల్ సంస్థ పాలను సేకరించనుంది.  ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. లీటర్ పాల ధర కంటే లీటర్ మినరల్ వాటర్ ధర ఎక్కువ అని ప్రజలు తనకు పాదయాత్రలో చెప్పిన మాటలు గుర్తుకు ఉన్నాయన్నారు.  అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకొన్నామన్నారు.