జగన్ పై ఎస్సీ ఎస్టీ కేసు ?

First Published 29, Nov 2017, 1:19 PM IST
Defected MLA giddy says she will lodge complaint on ys jagan
Highlights
  • తాజా ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరి వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్లు చేశారు.

తాజా ఫిరాయింపు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరి వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్లు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురించి తనకు మానసిక క్షోభకు గురిచేస్తున్నట్లు మండిపడ్డారు. జగన్ పత్రిక, టివి ఛానళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ ఎగిరిపడ్డారు. జగన్ పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి అవ్వటానికి కాదా అంటూ ప్రశ్నించారు. పార్టీ కోసం తాను మూడున్నరేళ్ళు కష్టపడింది కనబడలేదా అంటూ నిలదీశారు. జగన్ కు గిరిజనాభివృద్ధి పట్టదంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు గిరిజనుల కోసం చాలా చేసినట్లు కితాబిచ్చారు.

గిరిజన మహిళ అయినంత మాత్రాన తాను అత్యున్నత పదవులకు అర్హురాలిని కానా అంటూ ప్రశ్నించారు. తాను రూ. 25 కోట్లు తీసుకుని టిడిపిలోకి ఫిరాయించినట్లు జగన్ తన మీడియా ద్వారా దుష్ర్పచారం చేయిస్తున్నట్లు మండిపడ్డారు. చంద్రబాబు ప్రతీ మండలంలోనూ పెట్రోలు బంకులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఏజెన్సీ ఏరియాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెడతానని చంద్రబాబు తనకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. గిరిజన మహిళనైన తనను జగన్ బాధపెడుతున్నందుకే తాను జగన్ పై ఎస్సీ, ఎస్టీ కేసు పెడతానని హెచ్చరించారు. కాగా, మంత్రి పదవి కోసమే తాను టిడిపిలోకి ఫిరాయించినట్లు జరుగుతున్న ప్రచారం విషయమై  మాట్లాడటానికి గిడ్డి ఈశ్వరి నిరాకరించారు.

 

loader