వచ్చే ఎన్నికల్లోగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకెళ్ళ ఖాయమట. అలాగని ఫిరాయింపు మంత్రి జోస్యం చెబుతున్నారు. మరి అది జోస్యమే చెబుతున్నారో లేకపోతే ప్రకటన వెనుక ఏమైనా మతలబుందో అర్ధం కావటం లేదు?

వచ్చే ఎన్నికల్లోగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకెళ్ళ ఖాయమట. అలాగని ఫిరాయింపు మంత్రి జోస్యం చెబుతున్నారు. మరి అది జోస్యమే చెబుతున్నారో లేకపోతే ప్రకటన వెనుక ఏమైనా మతలబుందో అర్ధం కావటం లేదు? కేసులున్నంత మాత్రానా జగన్ పాదయాత్ర చేయకూడదని రూలేమీ లేదు కదా? పాదయాత్ర విషయంలో పిటీషన్ ను విచారించిన కోర్టు కూడా జగన్ కు ఊరటనే ఇచ్చింది.

అక్రమాస్తులకు సంబంధించిన కేసుల విచారణలో భాగంగా ప్రస్తుతం జగన్ ప్రతీ శుక్రవారం కోర్టులో వ్యక్తిగత హాజరేసుకుంటున్నారు. అటువంటిది పాదయాత్ర సందర్భంగా ప్రతీ వారం అవసరం లేదన్న కోర్టు నెలకొకసారి వస్తే చాలన్నది. మరి అది జగన్ కు ఊరట కాకపోతే ఏంటి? కోర్టు పరంగా కానీ, పార్టీ పరంగా కానీ జగన్ కు అనుకూల వాతావరణం కనిపిస్తున్నపుడు వచ్చే ఎన్నికల్లోగా జగన్ మళ్ళీ జైలుకు వెళ్ళటం ఖాయమని ఫిరాయింపు మంత్రి చెప్పటంలో అర్ధమేంటి ?

వచ్చే ఎన్నికల్లో పులివెందులతో సహా మొత్తం 175 సీట్లూ టిడిపినే గెలుస్తుందని ఇంకో జోస్యం కూడా చెప్పేసారు మంత్రి. అంటే టిడిపికి వచ్చే సీట్ల విషయంలో చినబాబు నారా లోకేష్, ఫిరాయింపు మంత్రి ఇద్దరిదీ ఒకే మాట అన్నమాట. ఒకవైపు కేసుల విచారణ, ఇంకోవైపు పాదయాత్ర ఎలా సాధ్యమని జగన్ ను నిలదీసారు. కేసుల విచారణ, పాదయాత్ర గురించి ఆలోచించుకోవాల్సింది జగన్. మధ్యలో మంత్రికెందుకో అంత ఆందోళన. ‘కందకు లేని దురద కత్తిపీటకెందుకు’ అన్న సామెతలాగుంది పిరాయింపు మంత్రి మాటలు.

పైగా పాదయాత్ర గురించి మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రతో జగన్ పోల్చుకోవటం మూర్ఖత్వమే అంటున్నారు. తండ్రి పాదయాత్ర చేసినట్లే కొడుకు కూడా చేయాలనుకోవటంలో మంత్రికి తప్పేం కనిపించిందో అర్ధం కావటం లేదు. పాదయాత్రలో జగన్ సక్సెస్ అవుతారా లేక ఫైల్ అవుతారా అన్నది వేరే సంగతి. వైఎస్సాఆర్ పాదయాత్ర తర్వాత చంద్రబాబు కూడా పాదయాత్ర చేసారు కదా? మరి ఎందుకు చేసారో ఫిరాయింపు మంత్రి వివరిస్తే బాగుంటుంది.