రాజీనామాలపై  ఫిరాయింపు నేతలు కొత్త డ్రామా మొదలుపెట్టారు. అయితే, డ్రామాలో ప్రధానపాత్రను స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు కట్టబెట్టారు. నవంబర్ 10 నుండి ప్రారంభమవనున్న అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ఫీలర్ వదిలింది కదా? ఫిరాయింపు మంత్రులను బర్తరఫ్ చేయాలని, ఫిరాయింపు ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించాలన్నది వైసీపీ ప్రదాన డిమాండ్. ఎప్పుడైతే వైసీపీ డిమాండ్ మొదలుపెట్టిందో వెంటనే ఫిరాయింపులపై ఒత్తిడి మొదలైనట్లు కనబడుతోంది.

ఆ విషయంపైనే ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తామందరమూ ఎప్పుడో రాజీనామాలు చేసినట్లు చెప్పుకొచ్చారు. వైసీపీ నుండి టిడిపిలో చేరినపుడే తాము రాజీనామాలు చేశామని అయితే స్పీకరే వాటిని ఆమోదించలేదని స్పష్టంగా ప్రకటించారు. పైగా తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించకపోతే తామేం చేస్తామంటూ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఆది నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో స్పీకర్ కార్యాలయంతో పాటు చంద్రబాబునాయుడు కూడా ఇరుకునపడినట్లయింది.

ఇంతకాలం ఫిరాయింపు ఎంఎల్ఏలు తాము రాజీనామాలు చేసినట్లు ఎక్కడా చెప్పలేదు. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ తామెప్పుడో రాజీనామాలు చేశామంటూ చెప్పారు. అయితే అప్పట్లో ఆ విషయాన్ని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోలేదు. తాజాగా ఆది నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో టిడిపిలో గందరగోళం మొదలైంది. మంత్రి ఆది తాజా ప్రకటనతో స్పీకర్ కూడా ఇరకాటంలో పడ్డారు.

చంద్రబాబంటే అందుబాటులో ఉండరు కాబట్టి సమస్య లేదు. కానీ స్పీకర్ అలాకాదు. నిత్యం జనాలతోనే ఉంటారు. పైగా మీడియాకు కూడా బాగా సన్నిహితంగా ఉంటారు. కాబట్టి ఈ విషయమై మీడియా స్పీకర్ వెంటపడే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయ్. మరి మంత్రి తాజా వ్యాఖ్యలపై స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. సరే, ఏమి స్పందించినా చంద్రబాబు నుండి వచ్చే ఆదేశాల ప్రకారమే ఉంటుందన్న విషయంలో సందేహం లేదు.