ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోంది. రాగల 12 గంటల్లో ఇది తుఫానుగా బలపడనుంది. పశ్చిమ వాయువ్య దిశగా  పయనించి రేపు రాత్రి శ్రీలంక దగ్గర తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది.

దీని ప్రభావంతో రేపు , ఎల్లుండి దక్షిణ కోస్తాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో సముద్రం అలజడిగా ఉంటుందని హెచ్చరించారు.

గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు తెలిపారు. రైతాంగం వ్యవసాయ పనులయందు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం కన్యాకుమారికి తూర్పు, ఆగ్నేయ దిశగా 930 కిలోమీటర్లు, శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు, ఆగ్నేయ దిశగా 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. తుపానుగా బలపడిన అనంతరం డిసెంబరు 2న ట్రింకోమలీ వద్ద తీరం దాటనుంది.

దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తమిళనాడులోని పలు ప్రాంతాలు, కేరళ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, డిసెంబరు 3న తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తమిళనాడు, కేరళలో 65 కిమీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది.