ఎస్ బిఐ ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యా బాధ్యతలు తీసుకున్న తర్వాత రద్దైన బకాయిలేనని ప్రచారం జోరందుకున్నది.

‘సూదికోసం సంతకెళితే పాత రంకులన్నీ బయటపడ్డాయ’ని తెలుగులో ఓ ముతక సామెతుంది. పెద్ద నోట్ల రద్దు అంశం దేశంలో ఇపుడు అలాగే తయారౌతోంది. పెద్ద నోట్ల రద్దుతో యావత్ దేశం అల్లకల్లోలమవుతుంటే ఏ ఏ బ్యాంకులు ఎవరెవరికి రుణాలు మాఫీ చేసాయన్న విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. నోట్ల రద్దు అంశం రాజ్యసభలో పెద్ద దుమారమే రేపుతుంటే బడా పారిశ్రామిక వేత్తలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసిన బకాయిల వివరాలు సంచలనం రేపుతున్నాయి.

ఎస్ బిఐ రద్దు చేసిన రుణాల వివరాలు బయటపడటంతో దేశంలో ఒక్క సారిగా కలకలం రేగుతోంది. సుమారు 63 మంది పారిశ్రామికవేత్తలకు స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 7,106 కొట్లు రద్దు చేసిన అంశంపై సర్వత్రా చర్చ మొదలైంది. బ్యాంకు రద్దు చేసిన రుణాల ద్వరా లబ్దిపొందిన వారిలో తెలుగు పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. ఏపిలో విక్టరీ ఎలక్ట్రికల్స్ కు రద్దైన రుణాలు రూ. 93.91 కోట్లు, కేఆర్ఆర్ ఇన్ ఫ్రా ప్రాజెక్టు రూ. 86.73 కోట్లు, విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్ గేర్స్ లిమిటెడ్ రూ. 65.57 కోట్లు, ఘనశ్యామ్ దాస్ జెమ్స అండ్ జ్యూవలర్స్ రూ. 61.72 కోట్ల మేరకు లబ్ది పొందాయి.

అదేవిధంగా, తెలంగాణాలో ఎస్ఎస్వీజీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ రూ. 65.24 కోట్లు, యాక్సిస్ స్ట్రక్చరల్ రియల్స్ రూ. 51.49 కోట్లు లబ్దిపొందాయన్నది సమాచారం. అదే విధంగా ఎస్బిఐ రద్దు చేసిన బకాయిల్లో లిక్కర్ కింగ్ గా ప్రచారం పొంది ప్రస్తుతం పరారీలో ఉన్న విజయ్ మల్యా రుణాలు కూడా రూ. 1200 కోట్ల రద్దైన సంగతి తెలిసిందే. పై మొత్తాలన్నీ ఎస్ బిఐ ఛైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యా బాధ్యతలు తీసుకున్న తర్వాత రద్దైన బకాయిలేనని ప్రచారం జోరందుకున్నది.