సరదా కోసం స్నేహితులతో ఆడిన కబడ్డీ ఆట ఆ యువకుడి ప్రాణాలు తీసింది.  ఆడుతూ ఆడుతుండగానే.., ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కడప జిల్లా చెన్నూరు మండలం, కొండపేటకు చెందిన పెంచలయ్య,జయమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరు స్థానికంగా రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్నకుమారుడు నరేంద్ర ఎం.కాం చదువుకున్నాడు. చిన్నతనం నుంచి కబడ్డీ అంటే నరేంద్రకు ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి వివిధ టోర్నీల్లో పాల్గొని ట్రోఫీలు సాధించాడు.

ఈ క్రమంలో వల్లూరు మండలం, గంగాయపల్లెలో జరిగిన నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీలో పాల్గొన్నాడు. మ్యాచ్ మధ్యలో కూతకు వెళ్లిన నరేంద్రను ప్రత్యర్థులు టాకిల్ చేశారు. పాయింట్ కోల్పోయిన అనంతరం తిరిగి కోర్టులోకి వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. జట్టు సభ్యులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే నరేంద్ర మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

కోర్టులో ప్రత్యర్థి జట్టు సభ్యులంతా ఒక్కసారిగా మీదపడటంతో అతని గుండెపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. నరేంద్ర కూతకు వెళ్లి, కుప్పకూలిపోయిన ఘటన అక్కడే ఉన్న ఒకరు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. తొలుత నరేంద్ర నడుస్తుండగా జారిపడినట్లు అందరూ భావించారు. కానీ అతను చనిపోయాడని తెలిసి షాక్ కు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.