Asianet News TeluguAsianet News Telugu

దారుణం...పోలీసుల పరిధుల పంచాయతీ.. ఏట్లోనే నానుతున్న మృతదేహం...

ఏట్లోని మృతదేహాన్ని వెలికి తీయడానికి తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటూ పోలీసులు వంతులు వేసుకోవడంతో.. ఓ కుటుంబం తీవ్ర ఆవేదనతో ఏటి ఒడ్డునే పడిగాపులు కాస్తోంది.

Dead body in Pothireddypadu Head Regulator third Gate in Krishna district
Author
First Published Nov 25, 2022, 6:46 AM IST

కృష్ణాజిల్లా : పోలీసుల పనితీరు చాలాసార్లు విమర్శలకు దారితీస్తుంటుంది. సామాన్యుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి.. వారే కొత్తగా సమస్యలు తెచ్చిపెట్టే ఘటనలు ఎదురవుతుంటాయి. అలాంటి ఘటనే ఇది.. కృష్ణాజిల్లాలో ఓ తల్లిదండ్రుల 19 ఏళ్ళ కొడుకు కనిపించకుండా పోయాడు. ఆవేదనతో వారు అంతా వెతికి.. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.. కృష్ణా జిల్లాలో పోతిరెడ్డి పాడు వద్ద నీటిలో ఓ మృతదేహం తేలుతోంది.  మీ కొడుకేనేమో చూడండి అన్నారు. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఆందోళనతో అక్కడికి చేరుకున్నారు. 

తీరా అక్కడికి వెళ్లాక చూస్తే మృతదేహం బోర్లా పడి ఉంది. నీటిలో తేలుతూ ఉంది. ఏమీ కనిపించడం లేదు. భుజం పట్టి తిప్పి చూడొచ్చు.. కానీ అది ఇల్లు కాదు.. అతను సజీవంగా లేడు. నీటిలో తేలుతున్నాడు. చూశాక తట్టుకునే శక్తి కూడా తమకు లేదు. పోలీసులు తప్ప మిగతా వారు ఎవరు ముట్టడానికి వీలులేని దారుణమైన పరిస్థితి.. కానీ, పోలీసులు అది తమ పరిధి కిందికి రాదంటే.. తమ పరిధి కిందికి రాదంటూ.. వంతులు వేసుకుంటున్నారు. దీంతో ఆ తల్లిదండ్రుల రోదన,  ఆవేదన మిన్నంటుతోంది. ఈ దారుణం ఏపీలోని నంద్యాల జిల్లాలో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్ద చోటు చేసుకుంది.

ప్రజలను లూటీ చేస్తున్నారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ ఫైర్

వివరాల్లోకి వెడితే.. ఈ నెల 21న సాయంత్రం నుంచి కర్నూలుకు చెందిన డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థి ఒకరు కనిపించకుండా పోయాడు. అంతా వెతికిన కుటుంబసభ్యులు 23వ తేదీన.. తల్లిదండ్రులు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కాస్త దర్యాప్తు చేసి.. పోతిరెడ్డిపాడు వద్ద గుర్తుతెలియని శవం ఉంది..చూడమని సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ మూడో గేటు వద్ద నీటిపై తేలిన ఆ యువకుడి మృతదేహంపై నీలిరంగు చొక్కా ఉంది. అప్పటికే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సమీపంలోని పాములపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది వచ్చి చూశారు. ఇది తమ పరిధిలోకి రాదన్నారు.  

జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పి వెళ్లిపోయారు. జూపాడు బంగ్లా పోలీసులు వచ్చి చూసి ఇది తమ పరిధి లోకి రాదని పాములపాడు పరిధిలోకే వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు.  కానీ శవాన్ని మాత్రం ఎవరూ వెలికి తీయలేదు. ఇలా ఒకరిపై ఒకరు చెబుతూ మృతదేహాన్ని అలా వదిలేసి వెళ్ళడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఒకరు వెలికి తీయించి ఉంటే ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆందోళనకు తెరపడేది. కనిపించడం లేదని ఒక వైపు.. చనిపోయాడేమో అనే బెంగ మరొకవైపు.. వారంతా ఏటి గట్టుమీద కూర్చుని కుమిలిపోతున్నారు. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios