నూతన్ నాయుడి ఇంట్లో శిరోముండనం ఘటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా దళిత సంఘాలు భగ్గుమన్నాయి.  దళితులపై దాడులు పెచ్చుమీరుతున్నాయని దళిత సంఘాల నాయకులు శనివారం ఆందోళనకు దిగారు.

విశాఖ జిల్లాలో అంబేద్కర్ యూత్ సంఘం, సిపిఎం, గిరిజన సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్బంగా అంబేద్కర్ కాలనీ, నాలుగు రోడ్లు కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు వద్ద శనివారం భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

పెందుర్తి మండలం  సుజాత నగర్ ప్రాంతానికి చెందిన సినీ నిర్మాత నూతననాయుడు శ్రీకాంత్ అనే దళిత యువకుడి పై సెల్ ఫోన్ దొంగిలించాడన్న నెపంతో అతడిని చితకబాది, శిరోముండనం చేసిన ఘటన హేయమైనదన్నారు.

ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక దళిత యువకుడికి పోలీస్ స్టేషన్ లో శిరోముండనం చేసిన సంఘటన మరవక ముందే విశాఖపట్నం జిల్లాలో ఇటువంటి పరిస్థితి నెలకొనడం దారుణమన్నారు.

ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా దళిత, గిరిజనులపై దాడులు పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంఘటన పై రాష్ట్రపతి, సీఎం వై ఎస్. జగన్మోహనరెడ్డి స్పందించినా  దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరుగుతూనే ఉండటంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read:నూతన్ నాయుడి ఇంట్లో దళితుడి శిరోముండనం: వీడియో చూడండి

దాడులకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోని, ఎస్ సి, ఎస్ టి అత్యాచారం నిరోధిక చట్టాన్ని ప్రభుత్వం పటిష్టం గా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు శిరోముండనం కేసులో నిర్మాత నూతన్ నాయుడి భార్య మధుప్రియతో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధుప్రియ సూచన మేరకే దళిత యువకుడికి శిరోముండనం చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.