త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. పొత్తు ఉంటే కేంద్ర పెద్దలే ప్రకటిస్తారని పురందేశ్వరి స్పష్టం చేశారు.
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. విజయవాడలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిన్న, నేడు రాష్రం లో రాజకీయ పరిస్థితులు చర్చించామన్నారు. శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితిపై 26 జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో చర్చించామని పురంధేశ్వరి పేర్కొన్నారు. మ్యానిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నామని.. నడ్డా, మోడీలు జన్మత్ రేఖను ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పారని ఆమె వెల్లడించారు.
ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించామని.. సామాన్య ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటామని పురంధేశ్వరి తెలిపారు. 175 అసెంబ్లీ, 25 ఎంపి సీట్లలో అభ్యర్థులపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని ఆమె వెల్లడించారు. వాటిని మా జాతీయ నాయకత్వానికి వివరిస్తామని.. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి అడుగులు ఉంటాయని పురందేశ్వరి చెప్పారు. పోటీ చేసే అభ్యర్థులు 2000 మంది వరకు వచ్చారని.. మా స్థాయిలో వాటిని క్రోడీకరించి ఒక్కో నియోజకవర్గంలో మూడు నుంచి ఐదుగురు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
మా పార్లమెంటరీ కమిటీ సమీక్ష చేసి అభ్యర్థులను ఖరారు చేస్తుందని.. పొత్తు ఉంటే కేంద్ర పెద్దలే ప్రకటిస్తారని పురందేశ్వరి స్పష్టం చేశారు. ఈ రెండు రోజుల సమావేశాల్లో పొత్తులపై అభిప్రాయ సేకరణ జరగలేదన్నారు. 175 అసెంబ్లీ, 25 ఎంపి స్థానాల్లో పోటీకి అభ్యర్థులు జాబితా సిద్దం చేశామని పురందేశ్వరి పేర్కొన్నారు. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి బెటర్ అనే దాని పైనే చర్చ సాగిందని.. మా జాబితా కేంద్రానికి రెండు రోజుల్లో పంపుతామని ఆమె తెలిపారు. ఆ తరువాత మా జాతీయ నాయకత్వం నిర్ణయాన్ని బట్టి కార్యాచరణ ఉంటుందన్నారు.
