నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘పెథాయ్’’ ఆంధ్రప్రదేశ్‌లో విలయతాండవం సృష్టిస్తోంది. దీని కారణంగా కోస్తా తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి, ఆదివారం సాయంత్రం నుంచి నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రానున్న 24 గంటల్లో పెథాయ్ పెను తుఫానుగా మారనున్న నేపథ్యంలో కళింగపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎనిమిది తీర మండలాలను అత్యంత ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించిన అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

తూర్పుగోదావరి జిల్లాలోని 17 మండలాలపై పెథాయ్ విరుచుకుపడే అవకాశం ఉంది. అలలు భారీగా ఎగిసిపడుతుండటంతో కాకినాడ-తుని రోడ్డుపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. మొత్తం 295 ప్రాంతాలు పెథాయ్ ప్రభావానికి గురవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. సముద్రంలో వేటకు వెళ్లిన 200 పడవలను అధికారులు వెనక్కి తెప్పించారు. మరోవైపు పెథాయ్‌ గమనాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... అధికారులను అప్రమత్తం చేశారు.

హుధుద్, తిత్లీ సహా వివిధ తుఫాన్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జనరేటర్లు, మంచినీరు, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని సీఎం అధికారులను ఆదేశించారు.

మరోవైపు తుఫాను తీరం దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలని.. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, బలమైన గాలులు వీచే అవకాశమున్న ప్రాంతాల్లో చెట్ల కింద నిల్చోరాదని సూచించింది.