Asianet News TeluguAsianet News Telugu

తీరం దాటిన మాండూస్ తుఫాన్.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జలమయం..

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ తీరం దాటింది. అర్దరాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది. 

Cyclone Mandous Makes landfall Heavy rains in south coast andhra pradesh and rayalaseema districts
Author
First Published Dec 10, 2022, 9:20 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ తీరం దాటింది. అర్దరాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది. తీరం వెంట 75 కి.మీ వేగంతో గాలులు వీచాయి. ప్రస్తుతం తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది. ఈ రోజు మధ్యామ్నం తర్వాత తుఫాన్ వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మండూస్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి‌లలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండూస్ తుఫాన్‌కు సంబంధించి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

మండూస్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. స్వర్ణముఖి నదికి వరద పోటెత్తింది. పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. కొన్నిచోట్ల హోర్డింగ్‌లు, చెట్లు కూలిపోయాయి. వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ల పరిధిలో ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచారు. 

భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పరిధిలో చెట్లు విరిగిపడ్డాయి. మరోవైపు తిరుమలలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సోమశిలకు  భారీగా వరద వస్తుందని అంచనా వేసిన అధికారులుముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పెన్నా డెల్టాకు నీటిని విడుదల చేశారు. 

మండూస్ తుఫాన్ తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు. రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios