అసని తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కరుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అసని తుపాన్ పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. 

అసని తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కరుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అసని తుపాన్ పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష చేపట్టారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై అధికారులకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. తుపాన్ దృష్ట్యా తీర ప్రాంతాలల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. 

తుఫాన్ బలహీనపడటం ఊరటనిచ్చే అంశం అయినప్పటికీ.. ఎక్కడ నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అవసరమైన చోట సహాయపునరావాస శిబిరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. సహాయ శిబిరాలకు తరలించిన ఒక్కో వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో తగిన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. 

తుపాను బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. వారికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆదుకోవాలని ఆదేశించారు. పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవద్దన్నారు. సెంట్రల్‌ హెల్ప్‌ లైన్‌తో పాటు, జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు సమర్థవంతగా పనిచేసేలా చూడాలని చెప్పారు. కంట్రోల్ రూమ్స్ నెంబర్లకు బాగా ప్రచారం కల్పించి.. వాటికి వచ్చే కాల్స్‌ పట్ల వెంటనే స్పందించాలని ఆదేశించారు.

బలహీనపడిన అసని..
అసని తుపాను బలహీనపడింది. అసని.. తీవ్ర తుఫాన్ నుంచి తుఫాన్‌గా బలహీనపడినట్లుగా వాతావరణశాఖ పేర్కొంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ. వేగంతో కదులుతున్న తుపాను.. దిశ మార్చుకుని ఈశాన్యం వైపునకు కదులుతున్నట్టుగా తెలిపింది. రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనున్నట్లుగా వెల్లడించింది. మరికొన్ని గంటల్లో ఏపీ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అసని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయి. తుపాన్ తీరానికి సమీపానికి వస్తున్న కొద్ది గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. 

అసని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉప్పాడ, కోనసీమ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముంద్రంలో అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. పలుచోట్ల ఈదురుగాలులకు వరి పంట నేలకొరిగింది. తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏపీ తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మొహరించారు. తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

కంట్రోల్ రూమ్ నెంబర్లు..
విజయనగరం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నం.. 08922-236947
విజయనగరం ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నం. 08922-276888
చీపురుపల్లి ఆర్డీవో కార్యాలయంలో నంబర్లు.. 94407 17534, 08944-247288
భోగాపురం తహశీల్దార్ కార్యాలయంలో నంబర్లు.. 80744 00947, 70367 63036
శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నంబర్.. 08942-240557
బాపట్ల కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ నెంబర్లు 8712655878, 8712655881, 8712655918
అమలాపురం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నం. 0885 6293104
కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్‌ 1800-425-3077
కాకినాడ ఆర్డీవో కార్యాలయం నంబర్‌ 0884-2368100
పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం నంబర్‌ 96036 63327
కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ నం.1800 425 0325
విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌ నంబర్‌ 1800 425 00002, 0891-2590100, 2590102, 2560820
విశాఖ జీవీఎంసీ కార్యాలయంలో హెల్ప్ లైన్ నంబర్: 1800 4250 0009, 0891 2869106