తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రుణ యాప్ ల వ్యవహారంలో ఓ పోలీస్ కొడుకును అరెస్ట్ చేశారు. కేవలం ఆర్నెళ్లలో చైనా కంపెనీలు రూ.21 వేల కోట్లు కొల్లగొట్టాయి. ఈ కంపెనీల ఆర్ధిక వ్యవహారాలను కర్నూలుకు చెందిన నాగరాజు పర్యవేక్షిస్తున్నాడు. ఇతని సోదరుడు ఈశ్వర్ కుమార్ కూడా ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడు. 

ఈ నేపథ్యంలో నాగరాజును రెండు రోజుల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ వెనుక నాగరాజు తండ్రి, పోలీస్ అధికారి పాత్ర ఉందని తెలిసింది. ప్రజల్ని పీడిస్తుంది కన్న కొడుకని తెలియడంతో కనికరం చూపించకుండా అరెస్ట్ చేయించాడు.

తన కుమారుడు పరోక్షంగా లక్షల మందిని మోసం చేశాడని, ఘరానా నేరానికి పాల్పడ్డాడని ఆ పోలీస్ కు కొద్దిరోజుల క్రితమే తెలిసింది. ఈ విషయాన్ని నాగరాజుకు చెప్పకుండా కర్నూలుకు రావాలంటూ కోరారు. మూడు రోజుల క్రితం అతను ఇంటికి చేరుకున్నాడు. 

వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించారు. బంధం కంటే పోలీసు బాధ్యత గొప్పదని భావించిన పోలీస్ అధికారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లాలోని ఓ పోలీస్ ఠాణాలో ఏఎస్సైగా పనిచేస్తున్నానని, తన పేరు, వివరాలు బహిర్గతం చేయవద్దంటూ ఆయన సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులను అభ్యర్థించారు. 

ఏఎస్ఐ కు ఇద్దరు కుమారులు ఈశ్వర్ కుమార్, నాగరాజు. వీరు బెంగళూరులో కాల్ సెంటర్ లో ఉద్యోగం చేసేవారు. తొలుత నాగరాజు యాప్ రుణాల సంస్థలో చేరాడు. తర్వాత తన అన్న ఈశ్వర్ కుమార్ ను అందులోనే చేర్పించాడు. పోలీసులు నాగరాజును అరెస్ట్ చేయడంతో ఈశ్వర్ కుమార్ సైతం లొంగిపోయినట్లు తెలిసింది.