ఫోన్ పే అన్నాడు... ఎంపీకి కాల్ చేసాడు... డబ్బులు కొట్టేసాడు..: దాచేపల్లిలో ఘరానా మోసం (వీడియో)
దాచేపల్లికి చెందిన ఓ బట్టల వ్యాపారి సైబర్ నేరగాళ్ల బారినపడి బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు పోగొట్టుకున్నాడు.

గురజాల : స్మార్ట్ ఫోన్ వుంటే చాలు... ప్రపంచమే మనచేతిలో వున్నట్లు. షాపింగ్ చేయాలంటే బయటకు, ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు... మొబైల్ ద్వారానే అన్నిపనులు జరుగుతున్నాయి. అయితే సెల్ ఫోన్ తో కేవలం లాభాలే కాదు నష్టాలు కూడా వున్నాయి. మన ప్రమేయం లేకుండానే సైబర్ నేరగాళ్లు దొంగతెలివి ఉపయోగించిన మొబైల్స్ ద్వారానే బ్యాంకుల్లోని డబ్బులు దోచేస్తున్న అనేక ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఇలా మొబైల్స్ కు లింకులు పంపి, కస్టమర్ కేర్ అంటూ బ్యాంక్ వివరాలు సేకరించి దోచుకోవడం చూసాం. ఇలాంటి మోసాలపై ప్రజల్లో అవగాహన రావడంతో కొత్త కొత్త పద్దతుల్లో మోసాలకు తెరతీసారు సైబర్ నేరగాళ్ళు. ఇలా పల్నాడు జిల్లాలో ఓ బట్టల వ్యాపారిని బురిడీ కొట్టించాడో ఘరానా దొంగ.
వివరాల్లోకి వెళితే... పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో దేవరశెట్టి లక్ష్మీనారాయణ వాసవి క్లాత్ షోరూం నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే నిన్న(మంగళవారం) ఆయన షాప్ లో వుండగా ఓ వ్యక్తి బట్టలు కొనేందుకు వచ్చాడు. రెండు జతల పంచలు కొనుగోలు చేసిన అతడు ఆన్ లైన్ పేమెంట్ చేస్తానని తెలిపాడు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణ ఫోన్ తీసుకున్న కస్టమర్ మధ్య ప్రదేశ్ కు చెందిన ఎవరికో ఫోన్ చేసాడు. ఆ తర్వాత అకౌంట్ లో డబ్బులు పడినట్లు మెసేజ్ రావడంతో కస్టమర్ అక్కడినుండి వెళ్లిపోయాడు.
అయితే కస్టమర్ లా వచ్చిన వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత లక్ష్మీనారాయణ ఫోన్ కు మరో మెసేజ్ వచ్చింది. అది చూసి ఆయన కంగుతిన్నాడు. అకౌంట్ లోంచి ఏకంగా రూ.99,000 వేలు విత్ డ్రా అయినట్లు వచ్చిన మేసేజ్ చూసి కంగారుపడిపోయిన లక్ష్మీనారాయణ వెంటనే బ్యాంక్ కు వెళ్లాడు. సైబర్ నేరగాళ్లు ఈ డబ్బులు కొట్టేసినట్లు తెలిపిన బ్యాంక్ సిబ్బంది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనకు జరిగిన మోసంపై లక్ష్మీనారాయణ పిర్యాదు చేసాడు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
వీడియో
ముందుగా కస్టమర్ మాదిరిగా లక్ష్మీనారాయణ షాప్ కు వచ్చిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం బట్టల షాప్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. అలాగే బాధితుడి అకౌంట్ నుండి ఏ అకౌంట్ లోకి డబ్బులు బదిలీ అయ్యాయో తెలుసుకుంటున్నారు. ఇలాంటి సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా వుండాలని ప్రజలను పోలీసులు హెచ్చరిస్తున్నారు.