ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ ఒకే రకమైన కర్ఫ్యూ: మాస్క్ ధరించకపోతే జరిమానా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూలో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మిగతా జిల్లాల్లో మాదిరిగానే కర్ఫ్యూ అమలవుతుంది. కరోనా వైరస్ మీద జగన్ సమీక్ష జరిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఇక ఒకే విధమైన కర్ఫ్యూ అమలు కానుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రతి రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ అమలులో సడలింపు ఇచ్చారు. రాత్రి పది నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతను సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే సడలింపు కొనసాగుతూ వచ్చింది. ఈ జిల్లాల్లో కూడా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో మిగతా జిల్లాలతో సమానంగా సడలింపులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల లోపల దుకాణాలను మూసేయాల్సి ఉంటుంది.
కోవిడ్ నిబంధనలను రాష్ట్రంలో కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మాస్క్ ధరించకపోతే రూ. 100 జరిమానా వేయాలని కూడా ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 అమలులో ఉంటుంది.
ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వాక్సినేషన్) ఎం రవిచంద్ర, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ మల్లిఖార్జున, ఏపీఎంస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి విజయరామరాజు, హెల్త్ యూనివర్సిటీ వీసీ శ్యామ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హజరయ్యారు.