ఏపీలో నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడగింపు: సీఎం జగన్ ఆదేశాలు
కరోనా కట్టడికి రాష్ట్రంలో కర్బ్ఫూను నెలాఖరు వరకు పొడగించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. మరో నాలుగు వారాల పాటు కర్ఫ్యూ విధిస్తేనే ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.
అమరావతి: రాష్ట్రంలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఫలితాలు రావాలంటే నాలుగు వారాల పాటు కర్ఫ్యూ ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై, కోరనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆయన సోమవారంనాడు సమీక్షించారు.
రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి పది రోజులే అవుతోందని ఆయన గుర్తు చేశారు. కరోనా అదుపులోకి రావడానికి సమయం పడుతుందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. వాలంటీర్లను, ఆశా వర్కర్లను, గ్రామ సచివాలయాలను సమర్థంగా వాడుకోవాలని చెప్పారు.
కోవిడ్ కారణంగా మరణించినవారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. వారికి ఆర్థిక సాయం అందించేందుకు ఓ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. వారి పేరు మీద కొత మొత్తాన్ని డిపాజిట్ చేసే విధంగా, దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా వారి ఖర్చులకు వచ్చే విధంగా ఆలోచన చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
కర్ఫ్యూ విధించడం వల్ల కరోనా తగ్గుముఖం పట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఈ నెలాఖరు వరకు కర్ప్యూను పొడగించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్లు ఆయన చెప్పారు. బ్లాక్ ఫంగస్ ను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు.