ఏబీ వెంకటేశ్వరావును కలవని సీఎస్ సమీర్ శర్మ.. వెయిటింగ్ రూంలో నిరీక్షణ.. అయినా కానీ...
సీఎస్ సమీర్ శర్మను కలవడానికి వచ్చి ఏబీ వెంకటేశ్వరరావుకు నిరాశే ఎదురయ్యింది. వెయిటింగ్ రూంలో ఎదురు చూస్తున్న వెంకటేశ్వరరావును కలవకుండానే సీఎస్ వెళ్లపోయారు.
అమరావతి : సుప్రీంకోర్టు తీర్పు మేరకు తనకు పోస్టింగ్ ఇవ్వాలని సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బుధవారం సచివాలయానికి వచ్చారు. సీఎస్ ను కలిసేందుకు ఆయన చాలా సమయం వెయిటింగ్ రూంలో నిరీక్షించారు. అయితే, ఏబీ వెంకటేశ్వరరావుని కలవకుండానే సిఎస్ సచివాలయం నుంచి వెళ్ళిపోయారు. ముందుగానే అపాయింట్మెంట్ కోరినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 29న చాలా కాలం తర్వాత సీనియర్ ఐపీఎస్ ఏవి వెంకటేశ్వరరావు సచివాలయానికి వచ్చారు. యూనిఫామ్ లో ఆయన సెక్రటేరియట్ కి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు ఆయన సెక్రటేరియట్ కు వచ్చారు. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఆదేశాలను సీఎస్ దృష్టికి తీసుకువెళ్లారు వెంకటేశ్వరరావు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు రిపోర్టు చేయడానికి వచ్చానని తెలిపారు. తన పోస్టింగ్, పెండింగ్ జీతభత్యాల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకు వెళ్లారని తెలిపారు. ఇందుకు అవసరమైన ఆదేశాలను సీఎస్ ను కోరినట్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
కాగా, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులు తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఏబీ వెంకటేశ్వరరావు ని మళ్లీ సర్వీస్ లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అఖిల భారత సర్వీసు ఉద్యోగుల రూల్స్ ప్రకారం రెండేళ్లకు మించి సస్పెన్షన్ ఉండకూడదని ఏబీ వెంకటేశ్వరరావు తరఫున న్యాయవాది వాదించారు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్ పిని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సస్పెన్షన్ రెండేళ్లు ముగిసినందున ఇక పై సస్పెన్షన్ అమలులో ఉండదని సుప్రీంకోర్టు తెలిపింది. నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏబీ వెంకటేశ్వరరావును వైయస్ జగన్ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలను ఉల్లంఘించారని జగన్ సర్కార్ ఆయనపై కేసు నమోదు చేసింది అంతే కాదు ఆయనను సస్పెండ్ చేసింది.
అయితే తనపై విధించిన సస్పెన్షన్ ముగిసిందని ఏబీ వెంకటేశ్వరరావు ఈ ఏడాది మార్చి 25న ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కూడా లేఖ రాశారు. 2021 జూలైలో తనపై విధించిన సస్పెన్షన్ను చివరిసారిగా పొడిగించిన విషయాన్ని వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. తనపై విధించిన సస్పెన్షన్ కు సంబంధించిన జీవోలను రహస్యంగా ఉంచారని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, తనకు కూడా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ఎలా చూసినా కూడా సస్పెన్షన్ ముగిసిందని ఆయన తెలిపారు.
ఆయన ఈ లేఖ రాసిన తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పెగాసెస్ అంశంపై చర్చ జరిగింది. ఈ విషయమై హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిపై ఏబీ వెంకటేశ్వరరావు కూడా స్పందించారు. 2019మే వరకు పెగాసస్ సహా ఎలాంటి ఫోన్ టాపింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆయనకు సమీర్ శర్మ షోకాజ్ నోటీసు ఇచ్చారు. దీనికి ఏబీ సమాధానమిచ్చారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడినట్టుగా వివరణ ఇచ్చారు.