రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై దూకుడు పెంచారు ఏపీ ప్రధాన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశమై అభిప్రాయాలను తీసుకున్న ఆయన.. ఆ కాసేపటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావంతో అసలు ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అనే అంశాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అంతకుముందు వైసీపీ ప్రెస్‌నోట్‌పై అల్‌పార్టీ మీటింగ్ సందర్భంగా ఎస్ఈసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాతే సమావేశానికి ఆహ్వానించామని తెలిపారు.

Also Read:ఆశ్చర్యం: వైసీపీ లేఖకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కౌంటర్

వైసీపీ రాసిన లేఖ ఆశ్చర్యకరంగా ఉందన్నారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినా... ఎవరితోనూ సంప్రదింపులు జరపలేదని రాయడం సరికాదని ఆయన హితవు పలికారు. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సింఘాల్, కాటమనేని భాస్కర్‌తో సమావేశమయ్యామని నిమ్మగడ్డ చెప్పారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై చర్చించామని, సీఎస్‌తో కూడా సమావేశమవుతామని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే రాజకీయ పార్టీలను సమావేశానికి ఆహ్వానించామని.. ఎస్ఈసీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుందని చెప్పారు.