మోడి ప్రధాని అయ్యిందగ్గర నుండి పూర్తి బలమున్న రాష్ట్రాల్లో కూడా అస్ధిరత వచ్చేట్లు భాజపా చేస్తున్నది. ఉత్తరాఖండ్ లో జరిగిందదే.

తమిళనాడు రాజకీయాల్లో గవర్నర్ విద్యాసాగర్ రావు వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. కేంద్రం చెప్పినట్లు నడుచుకుంటున్న కారణంగానే తమిళ రాజకీయాలు రోడ్డున పడ్డాయంటూ పెద్ద ఎత్తున గవర్నర్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిఎం పీఠంపై పన్నీర్ సెల్వం-శశికళ వర్గాలు పోరాటం మొదలుపెట్టాయంటే అది పూర్తిగా పార్టీ వ్యవహారం. అందులో గవర్నర్ చేయగలిగేది ఏమీలేదు.

పోయిన ఆదివారం శశికళ శాసనసభాపక్షనేతగా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. సదరు తీర్మానాన్ని శశికళ వర్గం గవర్నర్ కు అందచేసింది కూడా. దాని ప్రకారం గవర్నర్ శశికళ చేత సిఎంగా పదవి స్వీకారం చేయించాల్సిందే తప్ప ఇంకో దారి లేదు. అయితే, ఇక్కడే భారతీయ జనతా పార్టీ కక్కుర్తి బయటపడింది. మెజారిటీ ఎంఎల్ఏ అభిమతాన్ని గవర్నర్ తోసిపుచ్చటంతోనే గవర్నర్ ఆలోచన ఏమిటో అర్ధమవుతోంది.

జయలలిత హటాత్తుగా మరణించటంతో ఏఐఏడిఎంకెలో విభేదాలు మొదలయ్యాయి. దాన్ని అవకాశంగా తీసుకోవాలని భాజపా అనుకుంటున్నది. అందుకు గవర్నర్ ను పావుగా ఉపయోగించుకుంటున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ కు తానేమీ తీసిపోనని నిరూపిస్తున్నది కూడా. ఏమాటకామాటే చెప్పుకోవాలి. యూపిఏ హయాంలో రాష్ట్రప్రభుత్వాలను కాంగ్రెస్ ఎక్కడా అస్ధిరపరచలేదు.

మోడి ప్రధాని అయ్యిందగ్గర నుండి పూర్తి బలమున్న రాష్ట్రాల్లో కూడా అస్ధిరత వచ్చేట్లు భాజపా చేస్తున్నది. ఉత్తరాఖండ్ లో జరిగిందదే. సుప్రింకోర్టు ద్వారా మోడికి తల బొప్పి కట్టినా పార్టీకి ఇంకా బుద్ధిరాలేదు. తమిళనాడులో కూడా మెజారిటీ ఎంఎల్ఏల అభిమాతానికి విరుద్ధ్ధంగా గవర్నర్ నడుచుకుంటున్నారు. అంటే, శశికళ స్ధానంలో పన్నీర్ సెల్వం బలం పుంజుకునేదాకా గవర్నర్ ఇదే వైఖరి అవలంభిస్తారేమో. చూస్తుంటే గవర్నర్ వ్యవహారం పన్నీర్ బలపడేందుకు దోహదపడేట్లుగానే ఉంది. లేకపోతే ఇరువైపు వాదనలు విన్న తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా కేంద్రానికి నివేదిక పంపటమేంటి?

సిఎం పదవికి శశికళను దూరంగా ఉంచటానికి వీలుగా సుప్రింకోర్టు కేసులను గవర్నర్ చూపుతుండటం విచిత్రంగా ఉంది. కేసులకు, సిఎంగా శశికళ ప్రమాణ స్వీకారానికి ఏమీ సంబంధం లేదు. ఒకవేళ అక్రమాస్తుల కేసులో శశికళ దోషి అయితే, అప్పుడే ఆమె రాజీనామా చేస్తారు. కేసులున్న వాళ్లు, శిక్షలు పడి పై కోర్టుల్లో స్టే పొదిన వారు కూడా రాజ్యాంగబద్దమైన పదవుల్లో అనేకమందున్నారు. మన రాజ్యాంగం, న్యాయవ్యవస్ధ కల్పించిన వెసులుబాటు అది. తమిళనాడు రాజకీయ సంక్షోభంలో గవర్నర్ పోషిస్తున్న పాత్ర మాత్రం వివాదాస్పదమవుతోంది. మొత్తానికి గవర్నర్ వ్యవస్ధను సిహెచ్ విద్యాసాగర్ రావు భ్రష్టుపట్టిస్తుండటం బాధాకరం.