ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ సిపిఎం నూతన కార్యదర్శిగా నియమితులైన శ్రీనివాసరావు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అలాగే వైసిపి, టిడిపి లకు కూడా ఆయన చురకలు అంటించారు.
అమరావతి: కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ (BJP) విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ (YSRCP), ప్రతిపక్షతెలుగుదేశం పార్టీ (TDP) లు పోరాడాలని తాజాగా ఏపీ సిపిఎం (cpm) కార్యదర్శిగా ఎంపికైన శ్రీనివాసరావు (srinivasrao) సూచించారు. బిజెపి దూకుడుకు వ్యతిరేకంగా తాము కూడా పోరాడతామన్నారు. ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం బిజెపి ఆర్థిక విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. ఇలా టిడిపి బాటలోనే వైసిపి నడుస్తోందని శ్రీనివాసరావు అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై గుంటూరు జిల్లా (guntur district) తాడేపల్లిలో మూడు రోజుల పాటు జరిగిన సిపిఎం రాష్ట్ర మహాసభల్లో చర్చించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. రాజకీయ తీర్మానాన్ని ఏకగ్రీవంగా మహాసభలు ఆమోదించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ... రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్ర ప్రదేశ్ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలని సిపిఎం కార్యదర్శి డిమాండ్ చేసారు.
read more ముగిసిన సీపీఎం మహాసభలు.. ఏపీ కొత్త కార్యదర్శిగా వీ. శ్రీనివాసరావు, 50 మందితో రాష్ట్ర కమిటీ
''రాష్ట్ర విభజన హామీలను మరిచి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి అంతా తామే చేస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది. ఆడిన మాటను తప్పే వారిని ఏమంటారో బిజెపి వాళ్లు గుర్తు చేసుకుంటే మంచింది. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించకపోగా విశాఖ ఉక్కును ప్యాక్టరీని అమ్మేస్తానంటోంది. ఇలాంటి కేంద్ర నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలు బిజెపిని చీత్కరిస్తున్నారు'' అని శ్రీనివాసరావు మండిపడ్డారు.
''ఇక రాష్ట్రంలో వైసిపి పాలన కూడా అలాగే వుంది. రాష్ట్రంలో ప్రైవేట్ సంస్థ ఆమూల్ విస్తరణకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించడం సరికాదు. ఆమూల్ టెక్నాలజీని వినియోగించుంటే అభ్యంతరం లేదు. కానీ విస్తరణ పేరుతో సహకార పాల ఉత్పత్తి కేంద్రాలను దెబ్బతిస్తే మంచిది కాదు. సహకార పాల ఉత్పత్తి కేంద్రాలకు ప్రభుత్వం తోడ్పాటు అవసరం'' అని పేర్కొన్నారు.
''వైసీపీ ప్రజలపై భారీగా పన్నుల భారం మోపుతోంది. వైసిపి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలు చేస్తాం. రాష్ట్రంలో వామపక్షాలు బలహీనపడ్డ మాటా వాస్తవమే. రాష్ట్రంలో వామపక్షాల బలోపేతానికి కృషి చేస్తాం. ప్రజాలకు చేరువుగా పార్టీని తీసుకెళతాము'' అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు.
read more సజ్జల మాటల్లో భయం కనిపిస్తోంది.. మేము ఫోకస్ పెడితే గల్లంతే.. భాజాపా ఎంపీ జీవీఎల్
ఇదిలావుంటే తాడేపల్లిలో జరిగిన సిపిఎం మహాసభల్లో ఏపీ రాజధానికి అమరావతి (amaravati)నే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీపీఎం చేసిన తీర్మానాన్ని అమరావతి రైతులు స్వాగతించారు. మహాసభల వేదిక వద్దకు వచ్చిన రాజధాని రైతులు సిపిఎం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఆంధ్రప్రదేశ్ సీపీఎం నూతన కార్యదర్శిగా వి శ్రీనివాసరావు ఈ మహాసభల్లో ఎన్నికయ్యారు. ఆయనతో పాటు 50 మంది సభ్యులతో కొత్త కమిటీని పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా వున్న మధుకి ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానం కల్పించారు.
