విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రమం వ్యక్తం చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. 
పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటూ ధ్వజమెత్తారు. పోలవరం టెండర్లను ఎందుకు రద్దు చేశారో వారికే తెలియదంటూ విరుచుకు పడ్డారు. 

ఏకపక్షంగా నవయుగ టెండర్లను రద్దు చేశారని మండిపడ్డారు. మరోవైపు రాజధాని అమరావతి విషయంలోనూ వైసీపీ ప్రభుత్వానికి క్లారిటీ లేదంటూ ధ్వజమెత్తారు. సాక్ష్యాత్తు మంత్రే దుష్ప్రచారం మెుదలు పెట్టారంటూ బొత్సపై సెటైర్లు వేశారు. 

అమరావతిలో రాజధాని ఉంటుందో లేదో అన్న అంశంపై సీఎం జగన్ ప్రకటన విడుదల చేయాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. రామకృష్ణను రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కలిశారు. రాజధానిని అమరావతి నుంచి తరలించుకుండా తమకు అండగా నిలవాలని రైతులు, గ్రామస్థులు కోరారు. 

రైతులు రాష్ట్ర రాజధానికి 33వేల ఎకరాలకు పైగా స్వచ్చంధంగా గతప్రభుత్వానికి భూములు ఇచ్చారని చెప్పుకొచ్చారు. కానీ వారికి ప్రస్తత ప్రభుత్వం కౌలు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. రాజధానిపై మంత్రులు రోజుకో ప్రకటన చేస్తూ ప్రజలను, ఆ ప్రాంత రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. 

రాజధానిపై రాష్ట్రంలో ఇంత గందరగోళ పరిస్థితి నెలకొన్నప్పటికీ సీఎం జగన్ స్పందించకపోవడం సరైంది కాదన్నారు. రాజధానిపై జగన్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. రాజధానిలో ఆగిన పనుులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. 

రాజధాని ప్రాంత వాసులకు సీపీఐ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు రాజధాని దొనకొండలో పెడితే అభివృద్ధి చెందుతుందా అంటూ నిలదీశారు. రాష్ట్రంలో ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు అవసరమా అంటూ నిలదీశారు. 

ఇసుక కొరతతో లక్షలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు. నూతన పాలసీ వచ్చే వరకు కనీసం పాత పాలసీని అయినా అమలు చేస్తే బాగుండేదని సీపీఐ రామకృష్ణ సూచించారు.