అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తుళ్లూరులో కనిపిస్తే మహిళలు ముక్కలు ముక్కలుగా నరికేస్తారని, అందుకే జగన్ పోలీసులను అడ్డుపెట్టుకుని తిరుగుతున్నారని ఆయన అన్నారు. 

తాడికొండలో ఆయన వైఎస్ జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రులను కూడా ఆయన దుర్బాషలాడారు. ఒక గాడిద అమరావతిని శ్మశానమంటాడని, వాడొక మంత్రి అని, పేరు బొత్స అని ఆయన అన్నారు. ఇక్కడి ప్రజలకు భయపడి గుండు కొట్టించుకుని తిరుగుతున్నాడని ఆయన అన్నారు.

ఇక్కడి ప్రజలు ఎంతో శాంతమూర్తులని, 50 రోజులైనా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారని ఆయన అన్నారు. అదే తమ రాయలసీమలో అయితే ఎక్కడిక్కడ పగులగొట్టేవాళ్లమని అన్నారు. చరిత్రలో 151 సీట్లతో మరోసారి ఏ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదని, అలాంటిది జగన్ మంచి పరిపాలన చేయాల్సింది పోయి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారని ఆయన అన్నారు .

ఇదిలావుంటే, తాడికొండ మహాధర్నా శిబిరం వద్ద డైరెక్టర్ వీ సముద్ర తీస్తున్న రైతుసేన చిత్రం ఆడియోను టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. సైనికుల్లా రైతులను కూడా దేశసేవకులుగా గుర్తించాలనే కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజధాని రైతులు చేస్తున్న పోరాటంపై ఓ పాటను సినిమాలో పెడుతున్నట్లు సముద్ర తెలిపారు.