విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను తిరస్కరించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు గవర్నర్ కు రామకృష్ణ ఓ లేఖ రాశారు. 

''రాష్ట్ర ప్రభుత్వం మీ ఆమోదానికి పంపిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను తిరస్కరించండి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకొచ్చింది. ఆనాడు అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ప్రకటించగానే వైఎస్ఆర్ సీపీతో సహా అన్ని పార్టీలూ హర్షం వ్యక్తం చేశాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి రాజధానికై 33 వేల ఎకరాలు అవసరమని చెప్పారు'' అని గుర్తుచేశారు. 

read more   నాలుగు ఇండ్ల గోడలు దూకిన కరోనా రోగి...కేవలం పరోటా కోసం

''స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రానికి  విచ్చేసి అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు. అమరావతికై కేంద్రం రు.1550 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పటికీ రు.9600 కోట్లు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి'' అని వివరించారు. 

''అమరావతిలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఉద్యోగులకు క్వార్టర్లు, గృహ నిర్మాణాల వంటి అభివృద్ధి ఇప్పటికే జరిగింది.  కాబట్టి రాజధాని తరలింపు వల్ల రాష్ట్ర ఖజానాపై పెనుభారం పడుతుంది. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఈ బిల్లులు ఆమోదయోగ్యం కాదు.   రాజధాని వికేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు బిల్లులను తిరస్కరించని పక్షంలో రాష్ట్రపతికి వద్దకు పంపండి'' అని రామకృష్ణ గవర్నర్ కు సూచించారు.