అమరావతి: అమరావతి రైతుల పోరాటం చరిత్రలో భావి తరాలకు స్ఫూర్తి గా నిలుస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అందరూ తప్పులు చేస్తారు కానీ ఆ తప్పును గుర్తించి సరి చేసుకోవాలి...నేను తప్పు సరి చేసుకొను అలాగే ఉంటాను అంటే ఎలా అంటూ సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇప్పటికైనా సీఎం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని... కేంద్రం కూడా స్పందించాలని రామకృష్ణ సూచించారు. 

రాజధాని కోసం అమరావతి రైతులు చేపట్టిన ఆందోళన ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా జయభేరి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీపీఐ తరపున పాల్గొన్న రామకృష్ణ వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.    

''భారతదేశంలో ఇంత అద్వాన్నంగా చట్టాలను ఎప్పుడూ ఆమోదించుకోలేదు. రాజధాని మారుస్తామని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? ప్రధాని మోదీ శంఖుస్థాపన చేసిన రాజధానిని వదిలేస్తారా?'' అని ప్రశ్నించారు. 

read more  ఎక్కడ ఏ ఆస్తి అమ్మాలా అని చూస్తున్నారు: జగన్‌పై జయదేవ్ వ్యాఖ్యలు

''రైతుల ఉద్యమాన్ని అణిచివేయలని చాలా కుట్రలు చేస్తున్నారు. రైతులపై రాళ్లు వేయడంతో పాటు అక్రమ కేసులు పెడుతున్నారు. అయినా రైతులు భయపడకుండా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రాజధానిపై పునరాలోచన చేయాలి'' అని సూచించారు. 

''ఈ వేదికపైన అందరూ ఉన్నారు ఒక్క వైసీపీ నేతలు తప్ప. రాజధాని ఉద్యమంతో ముఖ్యమంత్రి జగన్ గింగిరులు తిరుగుతున్నారు. అమరావతి రైతుల శాంతియుత ఉద్యమం తప్పకుండా ఫలితాన్నిస్తుంది'' అని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.