అమరావతి: పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు నిర్మాణం ఎలా పూర్తి చేస్తారు? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం పూర్తయితే నీళ్లు ఎగువకు వచ్చి వేలేరుపాడు, వి.ఆర్.పురం మండలాల్లోని పలు గ్రామాల నిర్వాసితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని... వారికి ముందు పునరావాసం కల్పించండి అని రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. 

నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ నిన్న(బుధవారం) పోలవరం ప్రాజెక్ట్ పనులను సందర్శించిన నీటిపారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను ముట్టడించారు. కాబట్టి తక్షణమే పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించి, పునరావాసం కల్పించి, న్యాయం చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. త్వరలోనే పోలవరం నిర్వాసితులతో సిపిఐ సమావేశం అవుతుందని... వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి పోరాటం చేస్తామన్నారు. 

read more  పోలవరం నిర్మాణం... ఐదుగురు ఇంజనీర్లు, 80మంది సిబ్బంది కరోనాకు బలి: మంత్రి అనిల్ ఆవేధన

ఇదిలావుంటే  బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు నీటిపారుదల మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఇస్తామ మంత్రి స్పష్టం చేశారు. అందుకు తగినట్లుగానే పోలవరం నిర్మాణంలో ప్రణాళికలను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.  

పోలవరం ఆర్ అండ్ ఆర్ కు సంబంధించి కూడా సమీక్ష చేసిన మంత్రి ప్రాజెక్టు పునరావాసానికి సంబంధించి 17 వేల ఇళ్ళను ఏప్రిల్ కల్లా పూర్తి చేయాలనుకున్నామన్నారు. కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో వేలల్లో కరోనా కేసులు వస్తున్నాయి కాబట్టి పని చేయడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి వుందన్నారు. ఎన్ని సమస్యలు ఉన్నా కచ్చితంగా ఈ సీజన్ లో నూటికి నూరు శాతం వారికి పునరావాసం కల్పించి తీరుతామని..  సమస్యలు ఉన్నా ధైర్యంగా ముందుకు వెళుతున్నాయని మంత్రి అనిల్ కేమార్ ధీమా వ్యక్తం చేశారు.